: చైనాపై నిఘా కోసం వియత్నాంను ఆశ్రయించిన భారత్

భారత్ కు పొరుగున ఉన్న చైనాపై నిఘాను ఉంచే దిశగా, దక్షిణ వియత్నాంలో ఓ శాటిలైట్ ట్రాకింగ్‌, ఇమేజింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. వియత్నాం కేంద్రంగా ఏర్పాటయ్యే సెంటర్ పని మొదలు పెడితే, దక్షిణ చైనా సముద్రం సహా చైనా మొత్తం భారత శాటిలైట్ల పరిధిలోకి వస్తుందని తెలుస్తోంది. దీంతో పాటు చాలా దశాబ్దాలుగా భారత్ కు వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న వియత్నాంతో బంధం బలపడుతుందన్నది మోదీ సర్కారు భావన. భూ పరిశీలనతో పాటు వ్యవసాయ, పర్యావరణ, సాంకేతిక రంగంలో శాటిలైట్లు సేవలందిస్తాయని తెలుస్తోంది. మరింత మెరుగైన క్వాలిటీతో తీసే చిత్రాలను సైన్యానికి కూడా పంచుకోవాలని భారత్ భావిస్తుండటం, చైనా ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమే. మరోవైపు సముద్ర జలాల విషయంలో చైనాతో నిత్యమూ గొడవ పడుతున్న వియత్నాం, భారత సహకారంతో నిఘాను మరింతగా పెంచవచ్చని మెరైన్ సెక్యూరిటీ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సెంటర్ తో అటు భారత్ కు, ఇటు వియత్నాంకు లాభం కలుగుతుందని , ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులను ఇస్రో అందిస్తుందని, దీనికి 23 మిలియన్ డాలర్ల వ్యయమవుతుందని సమాచారం.

More Telugu News