: బుడగ బద్దలు!... అమేజాన్ నికర నష్టం రూ. 1,724 కోట్లు

దేశంలో శరవేగంగా విస్తరిస్తున్నదని భావిస్తున్న ఈ-కామర్స్ బుడగ బద్దలవుతోందా? ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ భారత విభాగం నష్టాలు పెరుగుతుండటాన్ని చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మార్కెట్ వాటాను పెంచుకునే దిశగా యత్నిస్తున్న కంపెనీలు తక్కువ ధరలకు ప్రొడక్టులను విక్రయిస్తుండటం, అందుకు ప్రతిగా, సదరు ప్రొడక్టులను ఆన్ లైన్లో అమ్మకానికి ఉంచుతున్న సంస్థలకు చెల్లింపులు భారం కావడంతోనే నష్టాలు వస్తున్నాయని అంచనా. కాగా, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కు అమేజాన్ వెల్లడించిన సమాచారం ప్రకారం 2014-15 సంవత్సరంలో అమేజాన్ డాట్ కాం నికర నష్టం, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే రూ. 169 కోట్ల నుంచి రూ. 1,022 కోట్లకు పెరిగింది. ఆపై ఈ సంవత్సరం నష్టాలు రూ. 1,724 కోట్లకు చేరుకున్నాయి. ఇక ఇండియాలో మరో రెండు అతిపెద్ద ఆన్ లైన్ సంస్థలుగా గుర్తింపున్న ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ సంస్థల నష్టాలనూ కలుపుకుంటే నష్ట మొత్తం రూ. 5,052 కోట్లని తెలుస్తోంది. విడివిడిగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్ కార్ట్ నష్టం రూ. 715 కోట్ల నుంచి రూ. 2 వేల కోట్లకు పైగా పెరిగింది. స్నాప్ డీల్ నష్టం రూ. 1,328 కోట్లకు చేరుకుంది. అమేజాన్ సంస్థకు వచ్చే ప్రధాన ఆదాయం సెల్లర్ కమిషన్ కాగా, ఆపై వ్యాపార ప్రకటనల ఆదాయం, కిండెల్ ఈ-రీడర్ అమ్మకాలతో ఆదాయం లభిస్తోంది. సెల్లర్ నుంచి వచ్చే కమిషన్ కు బదులుగా, వారికే అమేజాన్ సంస్థ ఇవ్వాల్సి వస్తోంది. దీనికి అదనంగా పలు ప్రొడక్టులను డెలివరీ చేసే వ్యవస్థ, గోడౌనుల నిర్వహణ సంస్థ ఖర్చులను తడిసి మోపెడు చేస్తుందని అంచనా. ఇక ఇప్పట్లో ఈ సంస్థలు లాభాల్లోకి నడిచే అవకాశాలు లేవని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ ధరలను పెంచితే, కస్టమర్లు తిరిగి సంప్రదాయ కొనుగోళ్లవైపు పయనించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ కంపెనీల ఆదాయం మాత్రం 500 శాతం వరకూ పెరగడం విశేషం. అదే వీటికి భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచుతోంది.

More Telugu News