: దేవుళ్ల పుణ్యమే... నగదీకరణ స్కీముకు చేరిన టన్ను బంగారం!

ఇండియాలో నిరుపయోగంగా ఉన్న 20 వేల టన్నుల బంగారాన్ని ఆర్థిక వ్యవస్థ వృద్ధికి వాడుకోవాలని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన బంగారం నగదీకరణ పథకంలో భాగంగా ఇప్పటివరకూ 900 కిలోలకు పైగా బంగారం బ్యాంకుల్లోకి వచ్చి చేరింది. ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శశికాంత్ దాస్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. "గోల్డ్ మానిటైజేషన్ స్కీం ద్వారా ఇప్పటివరకూ 900 కిలోలకు పైగా బంగారాన్ని సేకరించాం. ఈ స్కీము స్థిరంగా సాగుతోంది. భవిష్యత్తులో ప్రజల నుంచి మరింత స్పందన వస్తుందని భావిస్తున్నాం" అని ఆయన తెలిపారు. కాగా, తొలి దశలో విఫలమైన ఈ స్కీం మలి విడతలో భాగంగా మరోసారి ప్రకటించినప్పుడు పలు దేవాలయాల నుంచి బంగారం వచ్చినట్టు తెలుస్తోంది. ఈ 900 కిలోల్లో ప్రజలు పెట్టుబడిగా పెట్టిన బంగారం మొత్తం నామమాత్రమే. కాగా, ఈ స్కీములో డిపాజిటర్లకు సేవింగ్స్ పై వచ్చే వడ్డీ కన్నా తక్కువగా 2.5 శాతం మాత్రమే వడ్డీ లభిస్తుందన్న సంగతి తెలిసిందే. పెట్టుబడిగా వచ్చే బంగారానికి క్వాలిటీ పరీక్షలు, కరిగించడానికి అయ్యే ఖర్చులు తదితరాలు తమకు భారమౌతాయని భావిస్తూ, పలు బ్యాంకులు ఈ స్కీములో భాగంగా డిపాజిట్లు సేకరించేందుకు నిరాకరిస్తున్నాయి.

More Telugu News