: అంచనాలకు దిగువన విప్రో... 'బేర్'మన్న ఈక్విటీ!

ఇండియాలోని టాప్-2 ఐటీ సేవల సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ల మూడవ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు వెల్లడైన వారం రోజుల అనంతరం ప్రకటితమైన మూడవ అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో గణాంకాలు నిపుణుల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. డిసెంబరుతో ముగిసిన మూడవ త్రైమాసికంలో సంస్థ నికర లాభం తగ్గింది. నెట్ ప్రాఫిట్ రూ. 2,234 కోట్లకు చేరి, గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 1.8 శాతం పడిపోయింది. ఈ మూడు నెలల కాలంలో ఆదాయం 3 శాతం వృద్ధితో రూ.12,085 కోట్ల నుంచి రూ.12,951 కోట్లకు పెరిగిందని విప్రో ఈ ఉదయం ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతకుముందు నిర్వహించిన ఓ పోల్ లో సంస్థ ఆదాయం సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే 2.25 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. ఇక మార్చి త్రైమాసికంలో ఆదాయం 1.875 బిలియన్ డాలర్ల నుంచి 1.912 బిలియన్ డాలర్ల మధ్య నిలిచి 2 నుంచి 4 శాతం వృద్ధిని సాధించవచ్చని సంస్థ అంచనా వేసింది. "మేము మా ముందస్తు అంచనాలకు అనుగుణంగానే గణాంకాలను నమోదు చేశాం. సమీప భవిష్యత్తులో భారీ డీల్స్ కుదరనున్నాయి. ఎన్నో కంపెనీలు తమ కార్యకలాపాలను డిజిటల్ రూపంలోకి మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుండటం సంస్థకు లాభాలను చేకూర్చనుంది" అని సంస్థ ప్రస్తుత సీఈఓ టీకే కురియన్ వ్యాఖ్యానించారు. ఇక సంస్థను ముందుకు తీసుకెళ్లే బాధ్యత కొత్త సీఈఓ అబీదాలీ నీముచ్ వాలా చేతుల్లో పెడుతున్నట్టు ఆయన తెలిపారు. కాగా, ఈ ఫలితాలు స్టాక్ మార్కెట్ వర్గాల్లో సెంటిమెంట్ ను పెంచలేకపోయాయి. ఈ ఉదయం బీఎస్ఈ సెషన్ ఆరంభంలో విప్రో ఈక్విటీ విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 1.1 శాతం పడిపోయి రూ. 537కు చేరింది.

More Telugu News