: 19 నెలల కనిష్ఠానికి తోసేయబడ్డ స్టాక్ మార్కెట్!

ఓ వైపు చైనా మాంద్యం, మరోవైపు ముడిచమురు ధరల పతనం భారత స్టాక్ మార్కెట్ ను 19 నెలల కనిష్ఠానికి దిగజారేలా చేశాయి. జనవరి 15తో ముగిసిన వారాంతానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1.9 శాతం నష్టంతో 24,455 పాయింట్లకు, నిఫ్టీ 2.1 శాతం నష్టంతో 7,438 పాయింట్లకూ దిగజారగా, మిడ్ కాప్ 6 శాతం, స్మాల్ కాప్ 7 శాతం పతనమయ్యాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన అమ్మకాల ఒత్తిడే మార్కెట్ పతనానికి ప్రధాన కారణమని నిపుణులు వ్యాఖ్యానించారు. జనవరిలో మొత్తం రూ. 5,500 విలువైన ఈక్విటీలను విక్రయించిన ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా నిలిచారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల పతనం, ధరల స్థిరీకరణ దిశగా ఉత్పత్తి తగ్గించేందుకు ఒపెక్ నిరాకరించడంతో బ్యారల్ క్రూడాయిల్ ధర 12 సంవత్సరాల కనిష్ఠస్థాయిలోకి పడిపోయి 30 డాలర్ల దిగువకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వెల్లడైన వినియోగ ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు సైతం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. అధికార లెక్కల ప్రకారం నవంబరులో 4.28 శాతం వద్ద ఉన్న ఇన్ ఫ్లేషన్, డిసెంబరులో 5.61 శాతానికి పెరిగింది. ఇక పారిశ్రామికోత్పత్తి గడచిన నాలుగేళ్లలోనే అతి తక్కువ స్థాయికి పడిపోవడం కూడా ఈక్విటీల కొనుగోలు ఇన్వెస్టర్లను దూరం చేసింది. నవంబరులో ఐఐపీ 3.2 శాతానికి తగ్గింది. అంతకుముందు అక్టోబరులో 9.8 శాతం వృద్ధిని సాధించిన భారత పారిశ్రామికోత్పత్తి 3.2 శాతానికి దిగజారుతుందని ఎవరూ ఊహించలేదని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెరుగుతున్న నిరర్థక ఆస్తుల మొత్తం బ్యాంకింగ్ రంగాన్నే కుదేలు చేసింది. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులు 10 శాతం వరకూ నష్టపోయాయి. కాపిటల్ గూడ్స్ దిగ్గజాలుగా పేరున్న ఎల్అండ్ టీ, బీహెచ్ఈఎల్ తదితర కంపెనీలు అమ్మకాలు ఒత్తిడిలో కూరుకుపోగా, ముడిచమురు ధరల పతనంతో ఓఎన్జీసీ 4 శాతం దిగజారింది. హిందుస్థాన్ యూనీలివర్, టీసీఎస్ తదితర లార్జ్ కాప్ సెక్టార్ కంపెనీల ఈక్విటీలు భారీగా అమ్మకానికి వచ్చాయి. తదుపరి వారంలో సైతం ఒత్తిడి మధ్యే మార్కెట్ సూచికలు నడుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక కార్పొరేట్ల మూడవ త్రైమాసికం ఫలితాలు మార్కెట్ కు దిశానిర్దేశం చేయనున్నాయని, దీంతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్ సరళి, చైనా సూచికల పయనం కూడా సెన్సెక్స్, నిఫ్టీలపై ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించారు. త్వరలో వెల్లడి కానున్న డిసెంబర్ త్రైమాసికం స్థూలజాతీయోత్పత్తి గణాంకాలు సైతం మార్కెట్ గమనానికి కీలకమే.

More Telugu News