: టీసీఎస్ విఫలమైన వేళ... మెప్పించిన ఇన్ఫోసిస్!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించడంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ విఫలమైన వేళ, రెండో పెద్ద సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్ దూసుకెళ్లింది. అక్టోబరు - డిసెంబరు మధ్య కాలంలో సంస్థ నికర లాభం గత సంవత్సరంతో పోలిస్తే 6.6 శాతం పెరిగి రూ. 3,465 కోట్లకు చేరింది. ఈ గణాంకాలు నిపుణులు వేసిన అంచనాల కన్నా మెరుగ్గా ఉండటంతో, స్టాక్ మార్కెట్ నష్టాల్లో కొనసాగుతున్నా, ఇన్ఫోసిస్ ఈక్విటీ విలువ దూసుకెళ్లింది. ఉదయం 11:05 గంటల సమయంలో సంస్థ ఈక్విటీ 4.50 శాతం పెరిగి రూ. 1,131కి చేరింది. సెన్సెక్స్-30, నిఫ్టీ-50 సూచికల్లో మరే సంస్థ కూడా నేడు ఈ స్థాయిలో లాభపడలేదు. కాగా, మూడవ త్రైమాసికంలో సంస్థ ఆదాయం 15.2 శాతం పెరిగి రూ. 13,796 కోట్ల నుంచి రూ. 15,902 కోట్లకు పెరిగింది. తదుపరి త్రైమాసికంలో సైతం 10 నుంచి 12 శాతం వృద్ధి సాధ్యమేనని సంస్థ సీఈఓ విశాల్ శిక్కా వ్యాఖ్యానించారు. తమ సంస్థ మూలాలు బలంగా ఉండటంతో పాటు, కొత్తగా క్లయింట్ల చేరిక, ఆటోమేషన్ తదితరాలు మంచి ఫలితాలు నమోదు కావడానికి కారణమని అన్నారు. సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే ఈ నికర లాభం 2 శాతం, ఆదాయంతో పోలిస్తే 1.7 శాతం అధికం. సంస్థ వద్ద రూ. 31,526 కోట్ల మేరకు ఆర్థిక వనరులు ఉన్నాయని విశాల్ వెల్లడించారు.

More Telugu News