: పెరిగిన యూఎస్ వీసా ఫీజులపై భారత ఐటీ కంపెనీల కౌంటర్!

ఔట్ సోర్సింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల రంగం నుంచి ఆదాయాన్ని పొందుతున్న భారత ఐటీ కంపెనీలు పెరిగిన యూఎస్ వీసా ఫీజులపై స్పందించాయి. తమ నుంచి సేవలను పొందుతున్న విదేశీ కంపెనీలపై క్లయింట్ ఫీజులను, ప్రాసెసింగ్ చార్జీలను అధికంగా వసూలు చేయాలని నిర్ణయించాయి. వీసా ఫీజుల పెంపుదల కారణంగా తమ లాభాల్లో 60 బేసిస్ పాయింట్ల వరకూ కోత పడుతుందని వాపోతున్న టీసీఎస్, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫీజులను పెంచాలని నిర్ణయించాయి. కాగా, ప్రస్తుతం 150 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 10 లక్షల కోట్లు) చేరుకున్న భారత ఐటీ సేవల రంగంలో 70 శాతానికి మించిన ఆదాయం అమెరికా నుంచే వస్తోంది. ఐటీ కంపెనీలు సైతం క్లయింట్లకు దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో వేల మంది ఉద్యోగులను విదేశాలకు, ముఖ్యంగా అమెరికాకు పంపుతున్నాయి. ఇకపై వీరందరూ అమెరికా వెళ్లి పని చేయాలంటే, అవసరమైన అనుమతుల నిమిత్తం యూఎస్ సర్కారుకు ఐటీ కంపెనీలు అధికంగా చెల్లించాల్సి వుంటుంది. ఆ డబ్బును తిరిగి పొందేందుకు క్లయింట్లపైనే భారం వేయాలన్నది కంపెనీల నిర్ణయం. కాగా, అతిపెద్ద ఔట్ సోర్సింగ్ సేవల సంస్థ టీసీఎస్ గడచిన డిసెంబర్ త్రైమాసికంలో 10 శాతం వరకూ నికర లాభాలను పెంచుకోవచ్చని, ఇన్ఫోసిస్ 3 శాతానికి పరిమితం కావచ్చని థామ్సన్ రాయిటర్స్ గణాంకాలు అంచనా వేస్తున్నాయి.

More Telugu News