: ఫోర్బ్స్ 'గేమ్ చేంజర్స్' జాబితాలో 45 మంది మనోళ్లు

వివిధ రంగాల్లో విజయం సాధించి 30 ఏళ్లలోపు వయసులో ఉన్న యువ 'గేమ్ చేంజర్స్' జాబితాను ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేయగా, అందులో 45 మంది భారతీయులు, భారత సంతతి యువకులకు స్థానం లభించింది. '30 అండర్ 30' పేరిట మొత్తం 600 మంది పేర్లను ఫోర్బ్స్ విడుదల చేసింది. వీరంతా యువ ఔత్సాహికవేత్తలని, క్రియేటివ్ లీడర్లని, భవిష్యత్ ఆశాజ్యోతులని అభివర్ణించింది. కన్స్యూమర్ టెక్నాలజీ, విద్య, ప్రసార మాధ్యమాలు, ఉత్పత్తి రంగం, పరిశ్రమలు, విధాన నిర్ణయాలు, కళలు, సైన్స్... ఇలా వివిధ రంగాల నుంచి వీరిని ఎంపిక చేశామని పేర్కొంది. గతంలో ఎంత సీనియర్ అయితే, అంత నైపుణ్యం, నాణ్యతలు ఉంటాయన్న భావన ఉండేదని, ఇప్పుడు అది తప్పని వీరు తేల్చారని ఫోర్బ్స్ అభిప్రాయపడింది. కాగా, ఈ జాబితాలో 22 ఏళ్ల రితీష్ అగర్వాల్ (ఓయో రూమ్స్ సీఈఓ), 28 ఏళ్ల గగన్ బియానీ అండ్ నీరజ్ బెర్రీ (స్పిరిగ్ మోబైల్ యాప్ సృష్టికర్తలు), 25 ఏళ్ల కరిష్మా షా (గూగుల్ ఆల్ఫాబెట్ లో ప్రవేశించిన అతి పిన్న వయస్కురాలు), 27 ఏళ్ల లిల్లీ సింగ్ (రచయిత), 27 ఏళ్ల నీలా దాస్ (సిటీ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్), 29 ఏళ్ల దివ్యా నెట్టిమి (వైకింగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ లో అనలిస్ట్), 29 ఏళ్ల వికాస్ పటేల్ (మిలీనియమ్ మేనేజ్ మెంట్ లో హెడ్జ్ ఫండ్ అనలిస్ట్), 29 ఏళ్ల నీల్ రాయ్ (కాక్స్ టన్ లో ఇన్వెస్ట్ మెంట్ అనలిస్ట్) తదితరులకు స్థానం లభించింది.

More Telugu News