: రూల్స్ మార్చిన ట్విట్టర్... వాడకూడని పదాలివే!

నెటిజన్లు చేసే ట్వీట్లలో అభ్యంతరకర పదాలు ఉండరాదని ట్విట్టర్ పేర్కొంది. ఈ మేరకు తన రూల్స్ మారుస్తున్నట్టు ప్రకటించింది. ఎవరినైనా వేధించేలా, కించపరిచేలా ట్వీట్లు చేస్తే, వాటిని అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు 'అబ్యూజ్ అండ్ స్పామ్' సెక్షన్ ప్రారంభించామని, ఇందులో భాగంగా ద్వేషపూరిత వ్యాఖ్యలకు చెక్ చెప్పనున్నామని వెల్లడించింది. "హింస పెరిగేలా మీరు వ్యాఖ్యలు చేయరాదు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మరో వ్యక్తి మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు, జాతి వివక్ష, లింగ వివక్ష, మతపరమైన వ్యాఖ్యలు, వ్యక్తికున్న రుగ్మతలు, వికలాంగత్వాన్ని సూచించే వ్యాఖ్యల ప్రస్తావన ఇకపై ట్వీట్లలో ఉండరాదు" అని ట్విట్టర్ పేర్కొంది. ఆత్మహత్య చేసుకుంటామని వెల్లడించరాదని, ఉగ్రవాదం పేరిట ఏ తరహా వ్యాఖ్యలూ ఉండరాదని కూడా ట్విట్టర్ పేర్కొంది. ఎవరైనా కొత్త నిబంధనలను మీరితే, వారి ఖాతాలను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. కొత్త రూల్స్ పై కస్టమర్లకు అవగాహన కల్పిస్తున్నామని ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డిక్ కాస్టోలో వెల్లడించారు. కాగా, ఇటీవలి ఓ రీసెర్చ్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, నెటిజన్లలో 73 శాతం మంది ఆన్ లైన్ వేధింపులను చూస్తున్నారు. ఈ పరిస్థితి మారాలని డిక్ వ్యాఖ్యానించారు.

More Telugu News