ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ గిరిజన బాలికకు ప్రాణభిక్ష పెట్టిన సింహాలు!

Thu, Dec 31, 2015, 04:04 PM
ఇథియోపియా దేశీయులతో పాటు బీబీసీని కూడా ఓ గిరిజన బాలిక ఆశ్చర్యంలో ముంచెత్తింది. దక్షిణ ఇథియోపియాలోని సెఫలోనియా ప్రాంతంలోని ఓ గ్రామంలో పోలీ అనే బాలిక నివసిస్తోంది. ఆడుతూ పాడుతూ ఆప్యాయంగా ఉండే పోలీని తెలియని వారు ఆ గ్రామంలో లేరు. విదేశాల ధనదాహానికి ఆ గిరిజన ప్రాంతాలు కరిగిపోయాయి. మైనింగ్ పేరిట జరిపిన తవ్వకాలు అక్కడి వారికి తాగు నీరు లేకుండా చేశాయి. తాగు నీటికి అడవుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి, అడవిలోకి వెళ్తే సింహాలు మనుషులను వేటాడి చంపేసేవి. ఇలాంటి పరిస్థితుల్లో పోలీ గ్రామానికి సమీపంలోని అడవిలోకి క్యాన్ పట్టుకుని నీటికి వెళ్లింది. అక్కడి చెలమలో నీరు పట్టుకుని ఇంటికి వస్తుండగా, లస్సీ అనే యువకుడు ఆమెను ఎత్తుకెళ్లాడు. అక్కడి సంప్రదాయం ప్రకారం నచ్చిన యువతిని ఎత్తుకెళ్లి, ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చు.

దీంతో లస్సీ తన స్నేహితుల సాయంతో పోలీని ఎత్తుకెళ్లి అడవిలోని పొలంలో ఉన్న గుడిసెలో బంధించాడు. దీంతో పోలీ ఏడ్వసాగింది. చీకటి పడుతున్నా పోలీ ఇంటికి చేరకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి గాలింపు చేపట్టారు. ఇవేవీ తెలియని పోలీ గుక్కపట్టి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది. కళ్లు తెరిచి చూసేసరికి గుడిసె తలుపు ఖాళీల గుండా మిణుకుమిణుకు మంటూ ఆరు ఆకుపచ్చ దీపాల్లాంటి వెలుగులు కనిపించాయి. ఏవో పురుగులు అని భ్రమించిన పోలీ మళ్లీ ఏడ్వడం, తెల్లవారడం... లస్సీ వచ్చి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం, ఒప్పుకోకపోవడంతో ఆమెను కొట్టడం, సాయంత్రం తలుపులు వేసి వెళ్లిపోవడం, మళ్లీ రాత్రి ఆరు ఆకుపచ్చ దీపాలు కనపడడం జరిగింది. సరిగ్గా వారం తరువాత లస్సీకి పోలీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది. దీంతో దొరికిపోతే ఏం చేస్తారో అని భయపడ్డ లస్సీ, ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

ఆ రాత్రి పోలీ దగ్గరకు వెళ్లి ఆమెను తీవ్రంగా కొట్టి చంపేయడానికి గుడిసె బయటకు ఈడ్చుకువచ్చాడు. ఒక్క క్షణం ఆగితే చంపేసేవాడే. ఇంతలో దగ్గర్లోని పొదల్లో ఏదో అలికిడి వినిపించడంతో లస్సీ, పోలీ సహా లస్సీ స్నేహితులు కూడా అటుతిరిగారు. కళ్ళముందు ఆరు ఆకుపచ్చ దీపాలు మెరిశాయి. అవి మరింత ముందుకు వచ్చాయి. తీరా చూస్తే... ఆ ఆకుపచ్చ దీపాలు మూడు సింహాల కళ్ళు! అంటే ఇన్నాళ్లు తనకి కనపడినవి సింహాలన్న మాట అనుకుంది పోలీ భయపడుతూనే. వస్తూనే అవి వారి ముందుకు దూకాయి. లస్సీ, అతని స్నేహితులకు తమ దెబ్బలు రుచి చూపాయి. వారి చేతిలో దెబ్బలు తిన్న పోలీని అవి ఏమీ అనలేదు. గాయపడ్డ లస్సీ స్నేహితులు పరుగులంకించుకున్నారు. వారు పోలీని వెతుకుతున్న పోలీసులు, గ్రామస్థులకు ఎదురు పడి జరిగింది చెప్పారు. దీంతో గ్రామస్థులతో పాటు పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి అక్కడి దృశ్యం చూసి నోటమాట రాక ఆశ్చర్యపోయారు. పోలీకి రక్షణగా మూడు సింహాలు పహారా కాస్తున్నాయి. పోలీసులను చూసిన సింహాలు నెమ్మదిగా పొదల్లోకి వెళ్లిపోయాయి.

దీంతో పోలీసులు పోలీని క్షేమంగా ఇంటికి చేర్చారు. ఇది నెమ్మదిగా దేశం మొత్తం పాకింది. దీంతో పోలీకి శక్తులు ఉన్నాయనే ప్రచారం జరిగింది. అంతే, ఆమె అక్కడ సెలబ్రిటీగా మారింది. ఆమెను చూసేందుకు తండాల నుంచి ప్రజలు వెళ్లేవారు. మీడియా సంస్థల సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీంతో వివిధ దేశాలకు చెందిన వారు కూడా ఇందులో వాస్తవమెంతో తెలుసుకుందామని ఆ గ్రామానికి చేరుకునేవారు. ఈ గోల భరించలేని పోలీ కుటుంబం ఆ గ్రామం విడిచి మరో ప్రాంతానికి వలస వెళ్లి రహస్య జీవనం సాగిస్తోంది. ఈ ఘటన ప్రముఖ జంతు శాస్త్రవేత్త డాక్టర్ సిన్పూర్ దృష్టిని ఆకర్షించింది.

ఇందులో వాస్తవమెంతో తెలుసుకుందామని పోలీ, ఆమెను ఇంటికి చేర్చిన పోలీసు అధికారితో కలిసి ఆమె అడవిలోకి వెళ్లింది. ఈ ఘటన ఏ ప్రాంతంలో చోటు చేసుకుందో ఆ ప్రాంతానికి వారు ముగ్గురూ వెళ్లారు. అంతే, ఎక్కడ నుంచి వచ్చాయో కానీ మూడు సింహాలు అకస్మాత్తుగా వచ్చాయి. దీంతో ముగ్గురుకీ పై ప్రాణాలు పైపైనే పోయాయి. నెమ్మదిగా వారిని సమీపించిన సింహాలు పోలీని ఆప్యాయంగా నాకి వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ కథనాన్ని బీబీసీ ప్రసారం చేసింది. అయితే, పోలీ పట్ల ఆ సింహాలు చూపే ప్రేమ మహిమ మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు!
X

Feedback Form

Your IP address: 54.145.183.43
Articles (Latest)
Articles (Education)