: ఇక మరింత చౌకగా రుణాలు... వడ్డీ రేట్లు తగ్గించిన హెచ్డీఎఫ్సీ

ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నడుస్తున్న దారిలోనే ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ కూడా నడుస్తోంది. కనీస వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. "త్రైమాసిక సమీక్ష తరువాత బ్యాంకు బేస్ రేటును తగ్గించాలని నిర్ణయించింది. ఇకపై 9.30 శాతం వడ్డీకే రుణాలు లభిస్తాయి" అని బ్యాంకు కోశాధికారి ఆశిష్ వెల్లడించారు. తక్షణం కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. కాగా, ప్రస్తుతం ఇండియాలో లభిస్తున్న అతి తక్కువ వడ్డీ రేటు ఇదే కావడం గమనార్హం. గత సెప్టెంబరులో బేస్ రేటు 9.35 శాతానికి తగ్గించిన బ్యాంకు, ఇప్పుడు మరో 5 బేసిస్ పాయింట్ల కోతను విధించింది. ఫిక్సెడ్ డిపాజిట్ లపై మాత్రం వడ్డీ తగ్గింపు నిర్ణయాన్ని ఇంకా తీసుకోలేదని, మార్కెట్ పరిస్థితులను అంచనా వేస్తున్నామని ఆశిష్ తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న పోటీ, ఆర్ బీఐ రెపో రేటు 6.75 శాతంగా ఉండటం కారణాలతో రుణాలను పొందాలనుకున్న వారికి ఇకపై మరిన్ని ప్రయోజనాలు దగ్గరవుతాయని నిపుణులు వ్యాఖ్యానించారు. మరిన్ని బ్యాంకులు స్వల్పంగానైనా వడ్డీ రేట్లను తగ్గించక తప్పనిసరి పరిస్థితి నెలకొందని అంచనా వేశారు.

More Telugu News