: బెంగళూరు స్థానంలో హైదరాబాద్ చేరుతోంది: మంత్రి గ్రూప్ చైర్మన్

బెంగళూరు నగరం నిర్మాణ రంగ పెట్టుబడులకు అనుకూలం కాదన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందని, ఈ నేపథ్యంలో హైదరాబాద్, పూణె నగరాలు ప్రత్యామ్నాయాలుగా కనిపిస్తున్నాయని మంత్రి గ్రూప్ చైర్మన్ సుశీల్ మంత్రి వ్యాఖ్యానించారు. తాము బెంగళూరులో రెండు రెసిడెన్షియల్ ప్రాజెక్టుల నిమిత్తం ఇటీవలే నిధులు సమీకరించామని, ప్రస్తుతం భూ సమీకరణ పనులు జరుగుతున్నాయని, ప్రక్రియ పూర్తయ్యేవరకూ మరింత సమయం పట్టేలా ఉందని ఆయన వివరించారు. మధ్య తరగతి ప్రజలు తమ సొంతింటి కల నెరవేర్చుకునేందుకు, రూ. కోటి కన్నా తక్కువ విలువైన గృహాల సొంతానికి ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో సరైన ప్రణాళికలు లేకపోవడం వల్లే నిర్మాణ రంగంలో పరిస్థితి దారుణంగా ఉందని వివరించిన ఆయన, హైదరాబాద్ లో 2005 సమయంలో వేసిన మాస్టర్ ప్లాన్ కారణంగానే అక్కడ మౌలిక వసతులు మెరుగుపడ్డాయని అన్నారు. బెంగళూరులో 42 మీటర్ల రోడ్లు ఉండాల్సిన చోట్ల 18 మీటర్ల రోడ్లు మాత్రమే ఉన్నాయని, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ పరిస్థితి లేదని అన్నారు. అందువల్లే పెట్టుబడులు బెంగళూరును వదిలి పోతున్నాయని వివరించారు. దీనికితోడు బెంగళూరులో రెండు పడకగదుల ఇంటికి రూ. 30 వేల వరకూ అద్దెలు ఉండగా, హైదరాబాద్ లో రూ. 15 వేల నుంచి రూ. 20 వేల మధ్యనే ఉన్నాయని గుర్తు చేశారు.

More Telugu News