: విదేశీ ఇన్వెస్టర్ల మద్దతు, పెరిగిన సెంటిమెంట్... భారీ లాభాల్లో మార్కెట్

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఉత్సాహంగా భారత ఈక్విటీలను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం, ఇదే సమయంలో ఫండ్ సంస్థలు, రిటైల్ ఇన్వెస్టర్లు చూపిన ఆసక్తితో సెషన్ ఆరంభంలో ఉన్న నష్టాలు, ఆపై క్రమంగా లాభాలుగా మారగా, బెంచ్ మార్క్ సూచికలు దూసుకెళ్లాయి. క్రితం ముగింపుతో పోలిస్తే 200 పాయింట్ల దిగువన మొదలైన సెషన్లో, ఉదయం 10 గంటల తరువాత లాభాలు కనిపించగా, మరే దశలోనూ సూచికలు వెనుదిరిగి చూడలేదు. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 216.68 పాయింట్లు పెరిగి 0.85 శాతం లాభంతో 25,735.90 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 72.50 పాయింట్లు పెరిగి 0.93 శాతం లాభంతో 7,834.45 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.64 శాతం, స్మాల్ క్యాప్ 0.82 శాతం లాభాలను నమోదు చేశాయి. ఎన్ఎస్ఈ-50లో 39 కంపెనీలు లాభాల్లో నడిచాయి. ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐడియా, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కంపెనీలు లాభపడగా, సన్ ఫార్మా, గెయిల్, హిందుస్థాన్ యూనీలివర్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రా సిమెంట్స్ తదితర కంపెనీలు నష్టపోయాయి. గత వారాంతంలో రూ. 97,83,057 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్, రూ. 98,50,791 కోట్లకు పెరిగింది. మొత్తం 2,905 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,782 కంపెనీలు లాభాలను, 914 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

More Telugu News