: రూ. 30 వేల కోట్ల నష్టం... 7 వేల మందిని తొలగించాల్సిందేనంటున్న జపాన్ సంస్థ!

జపాన్ కేంద్రంగా పర్సనల్ కంప్యూటర్లు, టీవీలనూ విక్రయిస్తూ, గతంలో ఓ వెలుగు వెలిగి, ఆపై టెక్ ప్రపంచపు పోటీలో వెనుకబడిన తోషిబా, దాదాపు 7 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరంలో దాదాపు 4.53 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 30 వేల కోట్లు) నష్టాల్లో ఉండటం, ఆపై 1.3 బిలియన్ డాలర్ల అకౌంటింగ్ కుంభకోణంలో చిక్కుకుని ఇబ్బందులు పడుతుండటంతో, వేతనాల భారాన్ని తగ్గించుకోవాలని సంస్థ భావిస్తోంది. ఇక ఇండొనేషియాలోని టెలివిజన్ తయారీ కేంద్రాన్ని విక్రయించాలని, ఉద్యోగులకు వాలంటరీ రిటైర్ మెంటు ఇవ్వాలని కూడా సంస్థ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సంస్థను పునర్నిర్మించాలంటే, ఈ ప్రణాళిక అమలు తప్పనిసరని భావిస్తున్నామని, అందరు వాటాదారులు, బోర్డు డైరెక్టర్లు ఈ నిర్ణయాలకు ఆమోదం తెలుపుతారని భావిస్తున్నామని తోషిబా ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, తోషిబా లాభాలు 2008/09 నాటి స్థాయికి దిగజారాయి. కంపెనీ ఈక్విటీ విలువ సైతం ఆల్ టైం రికార్డు నుంచి 40 శాతానికి పైగా పడిపోయింది.

More Telugu News