: ఆపరేషన్ థియేటర్లో సంగీతం వినిపించిన రోగి!

తనకు సంగీతం ప్రాణం లాంటిదని, అందుకే ఆపరేషన్ సమయంలో రిస్క్ చేశానని ఇటీవలే బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న కార్లోస్ అగిలెరా తెలిపారు. స్పెయిన్ లోని మలగా నగరానికి చెందిన కార్లోస్ అగిలెరా (27) కి సంగీతమంటే ఎనలేని మక్కువ. కొంత కాలంగా అనారోగ్యం బారినపడుతుండడంతో వైద్యులను సంప్రదించి సమస్య చెబితే బ్రెయిన్ స్కాన్ చేశారు. అతని బ్రెయిన్ సమీపంలో కణితి బయటపడింది. దీంతో ఆపరేషన్ అనివార్యమని వైద్యులు స్పష్టం చేశారు. అయితే ఈ ఆపరేషన్ వల్ల తన సంగీత సామర్థ్యానికి ఎలాంటి ఢోకా రాదని భరోసా ఇస్తేనే ఆపరేషన్ కు సిద్ధపడతానని వైద్యులకు కరాఖండీగా చెప్పేశాడు. దీనికి వైద్యులు సరే అనడంతో తనకెంతో ఇష్టమైన శాక్సోఫోన్ వాయిస్తూ ఉంటానని, ఆ సమయంలో శస్త్ర చికిత్స చేయాలని వైద్యులకు చెప్పాడు. ఆ షరతుకు వైద్యులు ఓకే చెప్పడంతో ఆపరేషన్ టేబుల్ పై పడుకున్నాడు. దీంతో అతను పూర్తి అపస్మారక స్థితికి వెళ్లకుండా తేలికపాటి సెడెటివ్స్, పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. అతను సంగీతం నోట్స్ చూసుకోవడంలో సహాయపడేందుకు ఓ మెడికోను కేటాయించారు. దీంతో ముగ్గురు న్యూరోసర్జన్లు, ఇద్దరు న్యూరో సైకాలజిస్టులు, ముగ్గురు న్యూరో ఫిజీషియన్లు, ఓ అనెస్థియాటిస్ట్, ఐదుగురు నర్సులు విజయవంతంగా అతని కణితిని తొలగించారు. వారు ఆపరేషన్ చేస్తున్నంత సేపూ అతను శాక్సోఫోన్ వాయించడం విశేషం. ఈ ఆపరేషన్ అక్టోబర్ 13న జరగగా, పూర్తి ఆరోగ్యంతో కోలుకున్న అగిలెరా నేడు తొలిసారి బయటకువచ్చాడు. దీంతో తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ, ప్రాణం కంటే సంగీతం ముఖ్యమని భావించానని అందుకే రిస్క్ చేశానని చెప్పాడు.

More Telugu News