: ఫెడ్ భయాన్ని తోసిరాజని 'బుల్' హైజంప్!

అమెరికాలో పరపతి విధానాన్ని కఠినం చేస్తూ తీసుకున్న నిర్ణయం భారత స్టాక్ మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడికి కారణం కావచ్చన్న నిపుణుల భయాలు పటాపంచలయ్యాయి. పలు దేశాల స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో నడుస్తున్న వేళ మన మార్కెట్ బుల్ హై జంప్ చేసింది. సెషన్ ప్రారంభం నుంచి లాభనష్టాల మధ్య ఊగిసలాటలో కొనసాగిన సూచికలు, మధ్యాహ్నం ఒంటి గంట తరువాత తిరుగులేదన్న విధంగా లాభాల్లోకి దూసుకుపోయాయి. ఒంటిగంట సమయంలో క్రితం ముగింపు వద్దే ఉన్న సెన్సెక్స్, ఆపై రెండు గంటల వ్యవధిలో 300 పాయింట్లకు పైగా లాభాలను వెనకేసుకుంది. గురువారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 309.41 పాయింట్లు పెరిగి 1.21 శాతం లాభంతో 25,803.78 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 93.45 పాయింట్లు పెరిగి 1.21 శాతం లాభంతో 7,844.35 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.56 శాతం, స్మాల్ క్యాప్ 1.72 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 41 కంపెనీలు లాభాల్లో నడిచాయి. టాటా స్టీల్, టాటా పవర్, హిందాల్కో, వీఈడీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలు లాభపడగా, బోష్ లిమిటెడ్, ఐడియా, కెయిర్న్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ తదితర కంపెనీలు నష్టపోయాయి. బుధవారం నాడు రూ.97,16,696 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్, రూ. 97,53,746 కోట్లకు పెరిగింది. మొత్తం 2,682 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,654 కంపెనీలు లాభాలను, 819 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

More Telugu News