: అనుకున్నంతా అయింది... పదేళ్ల తరువాత 'వడ్డిం'చిన యూఎస్ ఫెడ్!

విశ్లేషకులు ఊహించినదే జరిగింది. దాదాపు దశాబ్దం తరువాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచింది. 2007-09 నాటి ఆర్థిక మాంద్యం చేసిన గాయాల నుంచి యూఎస్ పూర్తిగా బయటపడిందన్న సంకేతాలను పంపుతూ పావు శాతం మేరకు వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ఫెడ్ రిజర్వ్ చైర్ పర్సన్ జానెట్ యెల్లెన్ వెల్లడించారు. ప్రస్తుతం యూఎస్ వడ్డీ రేటు కనిష్ఠంగా 0, గరిష్ఠంగా 0.25 శాతం ఉండగా, దాన్ని 0.25 శాతం నుంచి 0.50 శాతానికి పెంచుతున్నట్టు వివరించారు. అంతకుముందు వడ్డీ రేట్లు పెంచాలా? వద్దా? అన్న విషయమై ఫెడ్ ప్రతినిధులు చర్చించారు. "అమెరికా ఆర్థిక వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగా ఉంది. కమిటీ న్యాయ నిపుణులు స్వల్పంగానైనా ఫెడరల్ ఫండ్ రేట్లు పెంచాలని భావించారు" అని యెల్లెన్ మీడియాకు వివరించారు. లేబర్ మార్కెట్ పరిస్థితులు సైతం మెరుగ్గా ఉన్నాయని, నిరుద్యోగ రేటు 5 శాతం, కన్నా కిందకు వచ్చిందని, ద్రవ్యోల్బణం సమీప భవిష్యత్తులో 2 శాతాన్ని మించవన్న అంచనాలు సైతం వడ్డీ పెంపు నిర్ణయానికి సహకరించాయని ఆమె పేర్కొన్నారు. కాగా, యూఎస్ సెంట్రల్ బ్యాంకు తీసుకున్నఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థను కొంత మేరకు కఠినం చేస్తుందని నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News