: ఇండియాపై ఫారిన్ ఇన్వెస్టర్ల ఆసక్తి... లాభాల్లో మార్కెట్లు!

భారత కంపెనీల ఈక్విటీలను కొనుగోలు చేసేందుకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఆసక్తిని చూపించడంతో సెషన్ ఆరంభంలోనే లాభాల్లోకి దూసుకెళ్లిన సూచికలు ఆపై వెనుదిరిగి చూడలేదు. మధ్యాహ్నం ఒంటిగంట తరువాత యూరప్ మార్కెట్ల అనిశ్చితి కొంత అమ్మకాలకు కారణమైనప్పటికీ, ఆ వెంటనే దేశవాళీ ఫండ్ సంస్థలు రంగప్రవేశం చేసి లాభాలను కొనసాగించాయి. బుధవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 173.93 పాయింట్లు పెరిగి 0.69 శాతం లాభంతో 25,494.37 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 50.00 పాయింట్లు పెరిగి 0.65 శాతం లాభంతో 7,750.90 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.35 శాతం, స్మాల్ క్యాప్ 0.24 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 32 కంపెనీలు లాభాల్లో నడిచాయి. భారతీ ఎయిర్ టెల్, ఓఎన్జీసీ, కెయిర్న్, పవర్ గ్రిడ్, ఐడియా తదితర కంపెనీలు లాభపడగా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆసియన్ పెయింట్స్, ఐటీసీ, హిందాల్కో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితర కంపెనీలు నష్టపోయాయి. మంగళవారం నాడు రూ. 96,58,760 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్, రూ. 97,16,696 కోట్లకు పెరిగింది. మొత్తం 2,914 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,426 కంపెనీలు లాభాలను, 1,267 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

More Telugu News