: ఆదాయం పోయింది... టీసీఎస్ వెనుకే విప్రో!

చెన్నైని చుట్టుముట్టిన వరదల కారణంగా, డిసెంబర్ త్రైమాసికంలో తమ ఆదాయం, మార్జిన్లు అంచనాలకన్నా తక్కువగా ఉంటాయని ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో కొద్దిసేపటి క్రితం వెల్లడించింది. ఇండియాలో మూడవ అతిపెద్ద సమాచార సాంకేతిక సేవలందిస్తున్న సంస్థగా ఉన్న విప్రో, చెన్నైలో నిర్వహిస్తున్న కేంద్రంలో 22 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. "ఇటీవలి భారీ వర్షాలు, ఆపై ముంచెత్తిన వరద చెన్నైలోని విప్రో కేంద్రంలో వ్యాపార కార్యకలాపాలను కుదేలు చేశాయి. డిసెంబర్ తొలివారంలో ఒక్క గంట పని కూడా జరగలేదు. దీని వల్ల ఆదాయాలు తగ్గనున్నాయి. ఈ త్రైమాసికంలో నిర్వహణా మార్జిన్ పై ప్రభావం కనిపించనుంది" అని విప్రో ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఇటీవల టీసీఎస్ సైతం ఇదే విధమైన ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. తమ భవంతులు, మౌలిక వసతులు భారీగా దెబ్బతిన్నాయని, వందలాది పనిగంటల నష్టం వాటిల్లిందని టీసీఎస్ పేర్కొంది. ఇక, విప్రో నేడు చేసిన ప్రకటన ఆ సంస్థ ఈక్విటీపై స్వల్ప ప్రభావాన్ని చూపింది. మార్కెట్ అర శాతం లాభంలో ఉండగా, విప్రో వాటాల విలువ అర శాతం పడిపోయి రూ. 556 వద్ద ట్రేడవుతోంది.

More Telugu News