: ధనవంతులుగా మార్చే 5 గోల్డెన్ రూల్స్!

పుట్టుకతోనే అందరూ ధనవంతులు కాలేరు. కానీ సరైన ఆర్థిక ప్రణాళిక ఉంటే ఎవరైనా, ఎంత సంపాదిస్తున్న వారైనా ధనవంతులుగా మారవచ్చు. ఈ ఆర్థిక సూత్రాలు ఎన్నడూ మారవు. వీటిని ఫాలో అవుతుంటే డబ్బులు వాటంతట అవే పేరుకుపోతుంటాయి. ఎవరినైనా ధనవంతులుగా మార్చే 5 గోల్డెన్ రూల్స్ ఇవి. సరైన ప్రణాళిక ఉంటే..: ఇక్కడ తొలిసారిగా లెక్కించాల్సింది ప్రస్తుత నెట్ వర్త్ ఎంత అన్నది. మీ మొత్తం ఆస్తులు, పెట్టుబడుల విలువ నుంచి అప్పులు తదితరాలను తీసేస్తే మిగిలే మొత్తం ఇది. ఆపై మీ లక్ష్యాలేంటన్నది లెక్కేసుకోవాలి. స్వల్పకాల (కారు, వివాహం తదితరాలు), మధ్యకాల (విదేశీ టూర్లు తదితరాలు), దీర్ఘకాల (పిల్లల చదువులు, వారి వివాహాలు, పదవీ విరమణ) లక్ష్యాలను రూపొందించుకోవాలి. ఆపై ఏ సమయానికి ఎంత మొత్తం అవసరమన్నది రాసి పెట్టుకోవాలి. పయనించే మార్గంలో ఎంత రిస్క్ ఉంది? దాన్ని ఎంతవరకూ భరించవచ్చన్న విషయాలు గమనించాలి. ఆపై చివరిగా ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్న విషయమై ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈక్విటీలు, డెట్, రియల్ ఎస్టేట్, బంగారం... తదితర మార్గాలు ఎప్పుడూ తెరిచేవుంటాయి. ఇక ఎంత త్వరగా మదుపు ప్రారంభిస్తే అంత ఎక్కువ నిధి చేరుతుంది. ఉదాహరణకు 25 ఏళ్ల వయసులో నెలకు రూ. 5 వేలు కూడబెడితే, పదవీ విరమణ నాటికి రూ. 1.2 కోట్లు పోగవుతుంది. అదే 30 ఏళ్ల వయసులో రూ. 6 వేలు పొదుపు ప్రారంభిస్తే రూ. 90.3 లక్షలు, 40 ఏళ్ల వయసులో రూ. 10 వేలతో సేవింగ్స్ మొదలు పెడితే రూ. 60.3 లక్షలు (సరాసరిన) చేతికందుతాయి. కుటుంబ భద్రతా ముఖ్యమే: చాలా మంది పెట్టుబడులు పెట్టుకుంటూ పోతారే తప్ప, దురదృష్టవశాత్తూ జరిగే ప్రమాదాల గురించి పట్టించుకోరు. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే... అని ఆలోచించుకున్నా, కుటుంబ అవసరాల నిమిత్తం వారి జీవనానికి సరిపడినంత బీమా తప్పనిసరిగా చేయించుకుని ఉండాలి. చాలా మంది బీమా పథకాలను పన్ను రాయితీల కోసమే కొంటుంటారు. పన్ను రాయితీలతో పాటు వైద్య ఖర్చులకు, దుర్ఘటనలు జరిగితే ఆదుకునేందుకు బీమా ఉపయోగపడుతుంది. పన్నులను ఎన్నడూ మరువద్దు: ప్రాణం పోతే తప్ప చెల్లించాల్సిన పన్నులు నిత్యమూ వెంటాడుతూనే ఉంటాయి. మారిపోయే నిబంధనలకు అనుగుణంగా, ప్రభుత్వానికి పన్నులను చెల్లించడం వల్ల జరిమానాల భారం తప్పుతుంది. ఇదే సమయంలో పన్ను రాయితీలూ సంపద పెరిగేందుకు తోడ్పడతాయి. పెట్టే పెట్టుబడులు నష్ట భయం తక్కువగా, లాభాలు ఎక్కువగా ఉండే పథకాల్లో పెట్టుకోవాలి. ఇందుకు ఎవరైనా నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఓ క్రమబద్ధమైన పెట్టుబడులు అయోమయం లేకుండా చూస్తాయి. పీపీఎఫ్ ఖాతాలు తప్పనిసరి. పిల్లల చదువుకు కూడా చిన్న మొత్తాలుగా పొదుపు చేస్తే, అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి నెలకు రూ. 500 పోగు చేసినా, వారు కాలేజీ విద్యను పూర్తి చేసే వరకు భారీ నిధి పోగవుతుంది. పెట్టుబడులను నిశితంగా పరిశీలించాలి: కేవలం పెట్టుబడి పెట్టి వాటిని మరచిపోకుండా, అది ఏ మేరకు సంపదను ఇస్తోందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ఆధారిత పెట్టుబడుల్లో సూచికల గమనాన్ని తెలుసుకోవాలి. కంపెనీల ఈక్విటీలు ఉంటే వాటి గురించిన వార్తలు తెలుసుకోవాలి. రిస్క్ ఉందని భావిస్తే, అప్పుడు ముందుగానే బయటపడే చాన్స్ లభిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఎలా నడుస్తున్నాయన్న సమాచారం ఇచ్చేందుకు ఎన్నో వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి: ఓ మంచి ప్లానర్ అంటే, కేవలం సరైన చోట పెట్టుబడులు పెట్టడం మాత్రమే కాదు. వాటిని సరైన సమయంలో వెనక్కు తీసుకోగలగాలి. ఫైనాన్షియల్ నాలెడ్జ్ సరిపడినంతగా ఉన్న వ్యక్తులు తమ లాభాలను మరింతగా పెంచుకోగలుగుతారు. ఇక చివరిగా ఈ విషయాలు మీకు తెలుసా? * యూలిప్ (యూనిట్ లింక్డ్ పాలసీ) ఆప్షన్లో భాగంగా మీ పెట్టుబడులు డెట్ లేదా ఈక్విటీ లేదా రెండింటిలో ఉంచాలన్న విషయంలో ముందే నిర్ణయం తీసుకోవచ్చు. * రెండింతల పన్ను రాయితీల ప్రయోజనం దక్కాలంటే ఓకే మార్గముంది. అది హిందూ అవిభాజ్య కుటుంబానికి మాత్రమే దగ్గరవుతుంది. సోదరులతో కలసి వుంటే ఇది సాధ్యం. దీంతో మీ సంపద మరింతగా పెరుగుతుంది. * మీకేదైనా తప్పుడు ప్రొడక్టును, అంటే మీ గురించిన అన్ని వివరాలు తెలిసి కూడా అంతగా ఉపయోగపడని ప్రొడక్టును బ్యాంకులు విక్రయిస్తే, కొత్త బీమా చట్టం ప్రకారం కేసులు పెట్టవచ్చు. * ఇప్పుడు మీరు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ '80సీసీడీ'లోని సబ్ సెక్షన్ 1బీ కింద రూ. 50 వేల వరకూ అదనంగా డిడక్ట్ చేసుకోవచ్చు. ఈ డబ్బు కొత్త పెన్షన్ స్కీములో పెట్టాల్సి వుంటుంది.

More Telugu News