: 5 కంపెనీలపై నిషేధాన్ని ఖరారు చేసిన సెబీ!

కనీస ప్రజల వాటా (మినిమమ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ - ఎంపీఎస్) నిబంధనలను పాటించని ఐదు కంపెనీలపై నిషేధాన్ని ఖరారు చేస్తున్నట్టు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వెల్లడించింది. హిందుస్థాన్ బ్రీవరీస్ అండ్ బాటిలింగ్, బాంబే రేయాన్ ఫ్యాషన్స్, గాంధీధామ్ స్పిన్నింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ, ఆటోమొబైల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండియా, ఇండియా షుగర్స్ అండ్ రిఫైనరీస్ కంపెనీలు ఏ విధమైన లావాదేవీల్లోను పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్టు స్పష్టం చేసింది. జూన్ 2013న 100కు పైగా ప్రైవేటు కంపెనీలకు ఎంపీఎస్ పై నోటీసులు ఇవ్వగా, చాలా వరకూ ప్రజల వాటాను పెంచుకున్నాయి. ప్రతి లిస్టెడ్ కంపెనీలో 25 శాతం వాటాలు ప్రజలకు ఉండాలన్నది సెబీ నిబంధన కాగా, దీన్ని పాటించని కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్ల ఓటింగ్ హక్కులను ఫ్రీజ్ చేస్తున్నామని, ఈ కంపెనీలపై పరపతి జరిమానాలను విధిస్తామని, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, వాటాల కొనుగోలు, అమ్మకాలు ఆపేస్తున్నామని సెబీ వెల్లడించింది. ఈ కంపెనీలకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా, అవి స్పందించలేదని సెబీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఇండియా షుగర్స్ లో 16.08 శాతం (మార్చి 2015 నాటికి), గాంధీధామ్ స్పిన్నింగ్ లో 1.18 శాతం, ఆటోమొబైల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండియాలో 15.29 శాతం, బాంబే రేయాన్ ఫ్యాషన్స్ లో 7.9 శాతం (సెప్టెంబర్ 2015 నాటికి) మాత్రమే ప్రజలకు వాటాలు ఉన్నాయి.

More Telugu News