: ఉక్కు కంపెనీలు లాభాల్లో, బ్యాంకులు నష్టాల్లో..!

స్టాక్ మార్కెట్లలో లాభాలు ఒక్క రోజుకే పరిమితమయ్యాయి. దాదాపు వారం రోజుల పాటు నష్టాల్లో సాగిన సూచికలు, గురువారం నాడు లాభాల బాట పట్టినప్పటికీ, ఇంటర్నేషనల్ మార్కెట్ల సరళి, తిరిగి నష్టాల్లోకి నెట్టేసింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడటంతో పాటు, దేశవాళీ ఇన్వెస్టర్లు ట్రేడింగ్ కు దూరంగా ఉండటంతో సూచికలు నష్టాల పాలయ్యాయి. ఇండియాలో వెలికితీసే ఖనిజాలపై సుంకాలను తగ్గించవచ్చని వెలువడిన వార్తలతో, ఈ రంగంలోని కంపెనీల ఈక్విటీలు లాభపడగా, యూఎఫ్ ఫెడ్ భయంతో బ్యాంకులు నష్టపోయాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 207.89 పాయింట్లు పడిపోయి 0.82 శాతం నష్టంతో 25,044.43 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 72.85 పాయింట్లు పడిపోయి 0.95 శాతం నష్టంతో 7,610.45 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.18 శాతం, స్మాల్ క్యాప్ 0.81 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 9 కంపెనీలు మాత్రమే లాభాల్లో నడిచాయి. టాటా స్టీల్, హిందాల్కో, ఇన్ఫోసిస్, వీఈడీఎల్, హిందుస్థాన్ యూనీలివర్ తదితర కంపెనీలు లాభపడగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, టాటా మోటార్స్, గ్రామిస్ తదితర కంపెనీలు నష్టపోయాయి. గురువారం నాడు రూ. 96,15,305 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్, శుక్రవారం నాడు రూ. 95,37,611 కోట్లకు తగ్గింది. మొత్తం 2,859 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 991 కంపెనీలు లాభాలను, 1,667 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

More Telugu News