: స్వచ్ఛమైన బంగారం దిగుమతిపై నిషేధం!

ఆసియా దేశాలతో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దుర్వినియోగం అవుతున్నాయన్న ఉద్దేశంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం దిగుమతులపై నిషేధాన్ని విధించాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉన్న భారత్ లో, బంగారానికి పెరుగుతున్న డిమాండ్ ను తగ్గించేందుకు దిగుమతులపై 2013లో 10 శాతం అదనపు సుంకాలను విధించగా, ఆనాటి నుంచి స్మగ్లింగ్ గణనీయంగా పెరుగగా, స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు అమలవుతున్న దేశాల నుంచి కేవలం రెండు శాతం దిగుమతి సుంకంతో ఆభరణాల రూపంలో 24 క్యారెట్ల బంగారం భారీ మొత్తంలో ఇండియాలోకి వస్తోంది. ఆపై దిగుమతి అయిన ఆభరణాలను కరిగించి నాణాలు, కడ్డీల రూపంలోకి మారుస్తున్నారని బులియన్ వర్గాలు వెల్లడించాయి. పూర్తి స్వచ్ఛతగల ఆభరణాలను విదేశాల నుంచి తెచ్చుకుంటే, తక్కువ సుంకాలతో సరిపోతుందని భావిస్తున్న అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు తక్కువ నాణ్యత ఉన్న, అంటే... 22 క్యారెట్లు, 18 క్యారెట్ల క్వాలిటీ ఆభరణాలకు మాత్రమే పాత రూల్స్ వర్తింపజేయాలన్నది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది. స్వచ్ఛమైన బంగారం దిగుమతి చేసుకోవాలంటే తప్పనిసరిగా 10 శాతం సుంకాలను వసూలు చేస్తే, కేంద్రానికి ఆదాయంతో పాటు దిగుమతులూ తగ్గవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, గడచిన ఆర్థిక సంవత్సరంలో రూ. 832 కోట్ల విలువైన స్మగుల్డ్ బంగారాన్ని వివిధ ఎయిర్ పోర్టుల్లో పట్టుకోగా, ఈ సంవత్సరం నవంబర్ వరకూ రూ. 430 కోట్ల విలువైన బంగారం పట్టుబడింది.

More Telugu News