: ఈ ఫోన్ ని సబ్బుతో కడిగేసినా ఏమీ కాదు!

సాధారణంగా ఫోన్ నీళ్లలో తడిస్తే పని చేయదు. వాటర్ ప్రూఫ్ ఫోన్ లు వచ్చినా అవి నీళ్లలో పూర్తిగా మునిగితే పని చేయవు. వీటన్నింటికీ భిన్నంగా నీటిలో మునిగినా, ఏకంగా సబ్బుతో కడిగేసినా ఎలాంటి ఇబ్బంది కలగని ఫోన్ ను జపాన్ కు చెందిన ఇంజనీర్లు తయారు చేశారు. జపాన్ కు చెందిన క్యోకెరా అనే సంస్థ డిగ్నో రెఫ్రే పేరుతో ఓ ఫోన్ ని తయారు చేసింది. ఈ ఫోన్ కేవలం వాటర్ ప్రూఫ్ మాత్రమే కాదు, సోప్ ఫ్రీ అని కూడా క్యోకెరా సంస్థ చెబుతోంది. దీనిని ఎక్కడ, ఎలా వినియోగించినా ఇబ్బంది లేదని భరోసా ఇస్తోంది. దీనిని జేబులో పెట్టుకుని వర్షంలో నడిచి వెళ్లినా, 43 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన వేడి నీటిలో ముంచినా ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తదని ఆ సంస్థ వెల్లడించింది. దీని టచ్ స్క్రీన్ తడిగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తదని ఆ సంస్థ ప్రకటించింది. వచ్చే శుక్రవారం దీనిని మార్కెట్ లో విడుదల చేయనున్నట్టు క్యోకెరా సంస్థ వెల్లడించింది. దీని ధరను 465 డాలర్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో 30,200 రూపాయలు అని సంస్థ వెల్లడించింది. ఈ ఫోన్ ను పెట్టేందుకు రబ్బరు బాతులాంటి స్టాండ్ ను కూడా ఆ సంస్థ వినియోగదారులకు అందజేస్తోంది.

More Telugu News