: అతివలకు అందలం ఇవ్వని కంపెనీలు 2,690... అన్నింటికీ నోటీసులు!

ప్రతి లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీల బోర్డు డైరెక్టర్లలో ఓ మహిళ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను సుమారు 2,690 భారత కంపెనీలు అమలు చేయలేదు. మహిళలను చేర్చుకునేందుకు పెట్టిన తుది గడువు ఎనిమిది నెలల క్రితమే ముగిసినా, ఇంతవరకూ స్పందించని ఈ కంపెనీలకు షోకాజ్ నోటీసులను ఇచ్చే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. అందుబాటులోని గణాంకాల మేరకు 2013 నాటి కంపెనీల చట్టం కింద ఇండియాలో 10,328 కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. వీటన్నింటిలో ఈ సంవత్సరం ఏప్రిల్ 1 లోగా మహిళా డైరెక్టర్ల నియామకం పూర్తి కావాల్సి వుండగా, కేవలం 74 శాతం కంపెనీలు అంటే, 7,638 కంపెనీలు మహిళలను చేర్చుకున్నాయి. కాగా, మహిళలను చేర్చుకోకుంటే, సదరు కంపెనీలపై జరిమానా విధించే అవకాశాలు ప్రస్తుతానికి లేనట్టే. మహిళా డైరెక్టర్లు లేని కంపెనీలపై పెనాల్టీలను మన చట్టం నిర్వచించడం లేదని గ్రాంట్ థ్రాంటన్ ఇండియా ఎల్ఎల్పీ లీడర్ షిప్ టీమ్ భాగస్వామి హెచ్.వీ. హరీష్ వ్యాఖ్యానించారు. షేర్ కాపిటల్ రూ. 100 కోట్లు లేదా టర్నోవర్ రూ. 300 కోట్లకన్నా అధికంగా ఉన్న ప్రతి కంపెనీలో డైరెక్టర్ల బోర్డులో ఓ మహిళ తప్పనిసరిగా ఉండాల్సి వుంది. ఇక ఈ నిబంధన పాటించని వారిపై రూ. 50 వేల వరకూ జరిమానా విధించేలా చట్ట సవరణకు సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కోరుతోంది. అయితే, ఈ విషయంలో కేంద్రం మాత్రం మరికొంత కాలం వేచిచూసే ధోరణిలో ఉండేలా కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు.

More Telugu News