: సాయుధ పోరాట స్ఫూర్తితో మళ్లీ ఉద్యమాలు చేపడతాం: సీతారాం ఏచూరి

సాయుధ పోరాట స్ఫూర్తితో మళ్లీ ఉద్యమాలు చేపడతామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర స్థాయి సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అమరవీరులకు సీపీఎం నేతలు నివాళులర్పించారు. అనంతరం ఏచూరి మాట్లాడుతూ, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో రైతు ఆత్మహత్యలు 19 శాతం పెరిగాయని, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అన్నారు. వెనుకబాటుతనం నిర్మూలనకు రాష్ట్ర సర్కార్ ఎటువంటి ప్రణాళికలు రచించడం లేదని, ఇరుగు పొరుగు దేశాలను పట్టించుకోకుండా సామ్రాజ్యవాదులతో కలిసేందుకు ప్రధాని మోదీ చొరవ చూపిస్తున్నారని, కార్మిక చట్టాల సవరణతో యాజమాన్యాలకు మేలు చేకూర్చేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించడం వల్ల దేశంలో ఉద్యోగావకాశాలు తగ్గుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని ఏచూరి పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మెదక్ జిల్లా సీపీఎం కార్యదర్శి మల్లేశం పాల్గొన్నారు.

More Telugu News