: బంగారం తాకట్టుకు ఇష్టపడని మనోళ్లు, బాండ్లపై మనసుపడ్డారు!

భారత ప్రధాని నరేంద్ర మోదీ మనసులో మొదలైన ఆలోచనల్లో ఒకటైన గోల్డ్ మానిటైజేషన్ స్కీములో బంగారం తాకట్టు పెట్టడానికి ఇష్టపడని భారతీయులు, బంగారం బాండ్లను కొనుగోలు చేయడానికి మాత్రం ఆసక్తి చూపారు. ఈ స్కీము తొలి విడతలో మొత్తం 917 కిలోల బంగారం బాండ్లకు 63 వేలకు పైగా దరఖాస్తులు అందాయని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శశికాంత్ దాస్ వెల్లడించారు. ఈ దరఖాస్తుల తరువాత రూ. 246 కోట్ల విలువైన గోల్డ్ బాండ్లను ప్రభుత్వం జారీ చేయనుందని ఆయన తెలిపారు. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఆరేళ్ల కనిష్ఠస్థాయిలో కొనసాగుతున్నందునే బాండ్ల కొనుగోలుకు మంచి స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. పొదుపు చేయాలనుకుంటున్న వారికి ఇది ఓ మంచి మార్గమని తెలిపారు. కాగా, 2012లో బంగారంపై దిగుమతి సుంకాలను పెంచిన తరువాత స్మగ్లింగ్ ఎంతగా పెరిగిందో, అంతే మొత్తంలో అధికారిక దిగుమతులూ నమోదయ్యాయి. ఇండియాలో బంగారం వాడకం 2013 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, గతేడాది 5 శాతం వరకూ పెరిగింది. 2013లో 53.8 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతులు నమోదుకాగా, ఈ సంవత్సరం ఇప్పటివరకూ 34 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయింది.

More Telugu News