: అతివలు చూస్తుంటే పురుషులు బాగా లాగించేస్తున్నారట!

మగవాళ్లు తింటున్నప్పుడు ఆడవాళ్లు ఎవరైనా పక్కనుంచి గమనిస్తున్నారని తెలిస్తే, మరింతగా లాగించేస్తుంటారని అమెరికన్ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. అదే ఇతర పురుషులు చూస్తున్నారని తెలుసుకున్న యువతులు మరింత తక్కువగా తింటున్నారని కూడా ఈ అధ్యయనంలో తేలింది. ఓ ఇటాలియన్ బఫే డిన్నర్ ను అధ్యయనంలో భాగం చేసిన సైంటిస్టులు, రీసెర్చర్ల బృందం, కనీసం ఓ మహిళ కూర్చున్న టేబుళ్లపై దృష్టిని సారించగా, అతివలు ఎవరూ లేని టేబుళ్లతో పోలిస్తే దాదాపు రెట్టింపు అధిక ఆహారం ఖర్చయిందట. మహిళల కంపెనీతో వీరంతా 86 శాతం వరకూ అధిక సలాడ్, 93 శాతం అధిక పిజ్జాలను లాగించేశారట. "అతివలు చూస్తున్న వేళ అవసరానికి మించి పురుషులు తింటున్నారు. అదే మహిళల విషయానికి వస్తే వ్యతిరేక ఫలితాలు వెల్లడయ్యాయి" అని న్యూయార్క్ లోని కార్నెల్ యూనివర్శిటీలో భాగంగా ఉన్న డైసన్ స్కూల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్ మెంట్ శాస్త్రవేత్త, అధ్యయన రూపకర్త కెవిన్ క్నిఫిన్ వెల్లడించారు. ఆ సమయంలో అతిగా మాట్లాడటాన్ని కూడా పురుషులు తగ్గించారని, ఆ సమయాన్ని మరింతగా తినడంపై కేటాయించారని తెలిపారు. 74 మంది పురుషులను, 59 మంది స్త్రీలను అధ్యయనంలో భాగం చేసి ప్రశ్నించినట్టు ఆయన తెలిపారు.

More Telugu News