: ఓ దీవి ఇస్తాం... అభివృద్ధి చేసుకోండి: రాందేవ్ బాబాకు మోదీ సర్కారు బంపరాఫర్!

యోగా గురువు రాందేవ్ బాబాకు మోదీ సర్కారు బంపరాఫర్ ఇచ్చింది. ఓ దీవిని అప్పగిస్తామని, అక్కడ సకల హంగులతో యోగా సెంటర్ ను నెలకొల్పడం ద్వారా టూరిజాన్ని అభివృద్ధి చేయాలని కోరింది. ఈ మేరకు షిప్పింగ్ మినిస్టర్ నితిన్ గడ్కరీ స్వయంగా బాబాను కోరారు. ఐలాండ్ రిసార్టులో యోగా క్లాసులు, ధ్యానం, ఆధ్యాత్మిక బోధనలు తదితరాలతో విదేశీ టూరిస్టులను ఆకర్షించవచ్చని భావిస్తున్నామని పీహెచ్డీసీసీఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ వివరించారు. రాందేవ్ ఏ దీవిని కోరినా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. అండమాన్, నికోబార్ పరిధిలోని నిన్ క్యూ దీవితో పాటు లక్షద్వీప్ లో భాగంగా ఉన్న మినీకాయ్ దీవిని ప్రతిపాదనల్లో ఉంచామని, ముంబై పోర్టు సమీపంలోని కన్హోజీ అంగ్రే, కన్యాకుమారి సమీపంలోని ముట్టమ్, పారాదీప్ దగ్గరున్న ఫాల్స్ పాయింట్ దీవులను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇక్కడ ఆయుర్వేద రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్లు, వాటర్ స్పోర్ట్స్, హెరిటేజ్ కేంద్రాలను అభివృద్ధి చేయాలన్నది తమ అభిమతమని పేర్కొన్నారు. కాగా, యోగా సెంటర్ ఏర్పాటుకు రాందేవ్ బాబాను ఆశ్రయించిన కేంద్రం, మిగతా గుర్తించిన దీవుల అభివృద్ధికి బిడ్డింగ్ విధానాన్ని పాటించాలని ఆలోచిస్తోంది.

More Telugu News