: గోవా పర్యాటకంపై పెను దెబ్బ... సురక్షిత దేశాల జాబితా నుంచి ఇండియాను తొలగించిన రష్యా

రష్యా పర్యాటకులు సురక్షితంగా ప్రయాణాలు సాగించవచ్చన్న దేశాల జాబితా నుంచి ఇండియాను తొలగిస్తూ ఆ దేశం నిర్ణయం తీసుకుంది. రష్యన్ న్యూస్ ఏజన్సీ 'ఇంటర్ ఫాక్స్' కథనం ప్రకారం, ఇండియా సహా ఈజిప్టు, టర్కీలకు రష్యన్ల ప్రయాణాలు అంత సురక్షితం కాదని పుతిన్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, గోవా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రష్యా టూరిస్టులపై అధికంగా ఆధారపడివున్న సంగతి తెలిసిందే. ఇండియాకు వచ్చే రష్యా వారిలో 50 శాతానికి పైగా గోవాను సందర్శిస్తుంటారు. ప్రస్తుతం ఏటా 3 లక్షల మంది వరకూ రష్యన్లు గోవాకు వచ్చి వెళుతున్నట్టు తెలుస్తోంది. గోవాలోని రష్యన్ సమాచార శాఖ కార్యాలయం సైతం తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గురించి గోవాలో పర్యటిస్తున్న దేశ ప్రజలకు వెల్లడించింది. ఇదే సమయంలో క్యూబా, వియత్నాం, సదరన్ చైనా ప్రాంతాలు రష్యన్ల పర్యటనలకు అనుకూల ప్రాంతాల జాబితాలో చేరాయి. రష్యన్ పర్యాటకుల సంఖ్య తగ్గితే గోవా పర్యాటక ఆదాయం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News