: 'బేర్'మన్న డాక్టర్ రెడ్డీస్... లాభాల్లో మార్కెట్!

ఆసియా మార్కెట్ల నుంచి అందిన సంకేతాలు సెషన్ ఆరంభంలో ఇన్వెస్టర్ల సెంటిమెంటును నిలిపి ఉంచగా, ఆపై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన కొనుగోలు స్పందన భారత స్టాక్ మార్కెట్ ను లాభాల్లోకి నడిపించింది. ముఖ్యంగా మధ్యాహ్నం ఒంటిగంట తరువాత సూచికలు ఏ దశలోనూ వెనుదిరిగి చూడలేదు. దీంతో నవంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెషన్ ముగింపు నాడు బెంచ్ మార్క్ సూచికలు లాభాలను నమోదు చేశాయి. గురువారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 182.89 పాయింట్లు పెరిగి 0.71 శాతం లాభంతో 25,958.63 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 52.20 పాయింట్లు పెరిగి 0.67 శాతం లాభంతో 7,883.80 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.26 శాతం, స్మాల్ క్యాప్ 0.45 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 34 కంపెనీలు లాభాల్లో నడిచాయి. యూఎస్ ఎఫ్డీయే నుంచి నిషేధాన్ని ఎదుర్కోనుందని వచ్చిన వార్తలతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఈక్విటీ కుదేలైంది. ఈ సెషన్లో అత్యధికంగా నష్టపోయింది ఈ సంస్థే. క్రితం ముగింపుతో పోలిస్తే 8.20 శాతం దిగజారిన డాక్టర్ రెడ్డీస్ ఈక్విటీ రూ. 3,110 వద్దకు చేరింది. టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఐడియా, గెయిల్, ఐటీసీ తదితర కంపెనీలు లాభపడగా, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, టీసీఎస్, అదానీ పోర్ట్స్ తదితర కంపెనీలు నష్టపోయాయి. ఈ సెషన్లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 98,42,984 కోట్లకు పెరిగింది. మొత్తం 2,899 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,622 కంపెనీలు లాభాలను, 1,049 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

More Telugu News