: పెళ్లికి ముందు మీకెవ్వరూ చెప్పని అతి ముఖ్యమైన విషయాలివి!

ఇది వివాహాల సీజన్. రోజుకు కొన్ని వేల పెళ్లిళ్లు తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా చూస్తే లక్షల సంఖ్యలో జరుగుతున్నాయి. వివాహ శుభవేళ, కొత్త బట్టలు, ఆభరణాలు, నోరూరించే విందు వినోదాలు, బంధు మిత్రుల హడావుడి మధ్య కాలం తెలియకుండానే రెండు మనసులు ఒకటవుతాయి. ఈ సమయంలో పెళ్లి తరువాత ఎదురయ్యే పరిస్థితుల గురించి నూతన వధూవరుల వద్ద ఎవరూ మాట్లాడరు. మంత్రాల రూపంలో "ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ..." అంటూ చెప్పే మాటలకు అర్థం తెలియకుండానే జంట ఒకటై పోతుంది. పెళ్లి తరువాత పరిస్థితులపై వివాహానికి సిద్ధమవుతున్నవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి. ముందున్నది పూల బాట కాదు: పెళ్లి సమయంలో అంతా సవ్యంగా జరుగుతున్నట్టుగానే ఉంటుంది. జీవితంలో వివాహం, ఆపై హనీమూన్... ఆ తరువాత ముందున్న కాలం పూల మార్గం కాదు. అలాగని ముళ్లబాటని చెప్పడానికీ వీల్లేదు. ఎంతో పట్టుదల, మరెంతో సహనంతో కొత్త జంట తీర్చిదిద్దుకోవాల్సిన బాట. అది పూలబాటవుతుందా? లేక ముళ్లబాటవుతుందా? అన్నది ఎదురైన సవాళ్లను అధిగమించే తీరుపై ఆధారపడివుంటుంది. పెళ్లినాటి ప్రమాణాలు భారమనిపిస్తాయి: ఒక మాటివ్వడం ఎంతో తేలిక. ఆపై దాన్ని నిలబెట్టుకోవడం ఎంతో కష్టం. నమ్మివచ్చిన జీవిత భాగస్వామికి ఏ లోటూ రాకుండా చూసుకోవడం ఎంత కష్టమన్నది పెళ్లయిన తరువాతే తెలుస్తుంది. భాగస్వామిపై ఎంత ప్రేమ ఉన్నప్పటికీ, ఒక్కోసారి శాంతిని వెతుక్కుంటూ ఎక్కడికైనా దూరంగా పారిపోవాలని అనిపిస్తుంది. ఆ సమయంలో అంతా నార్మల్ గానే ఉందని మనసులో నమ్మి కష్టాలకు ఎదురునిలిస్తేనే వైవాహిక జీవితం సుదీర్ఘకాలం సాగుతుంది. లేకుంటే ఆ పెళ్లి పెటాకుల దిశగా నడుస్తుంది. సమాన బాధ్యత తప్పనిసరి: అది కష్టమైనా, సుఖమైనా మరో వ్యక్తితో పంచుకోవడం ముఖ్యం. ఇక కలసి జీవితాంతం నడవాల్సిన భార్యాభర్తలైతే మరింతగా బాధ్యతలు పంచుకోవాలి. కేవలం పురుషుడు లేదా స్త్రీ మాత్రమే తమ వైవాహిక బంధం బలపడాలని కోరుకుంటే అది జరగదు. సంతోషాన్ని పంచుకుంటే రెట్టింపు అవుతుంది. బాధను పంచుకుంటే, సగానికి తగ్గుతుంది. ఇక సాధించాల్సిన లక్ష్యాలను, నెరవేర్చుకోవాల్సిన కలల గురించి భార్యాభర్తలిద్దరూ కలసి కృషి చేస్తే, మరింత త్వరగా అవి నెరవేరుతాయి. సంతోషాన్ని వెతుక్కోవాలి: ఏ వివాహమూ 100 శాతం పర్ ఫెక్ట్ భాగస్వామిని అందించదు. ఒకరిని ఒకరు సంతోషపరచుకుంటూ ముందుకు సాగితే, నూరుశాతం విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రతి రోజూ భాగస్వామికి బహుమతులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు. సంతోషపడేలా ఏదైనా చేసినా సరిపోతుంది. దైనందిన జీవితంలో కష్టాలు ఎలాగూ తప్పవు. ఇదే సమయంలో సుఖాన్ని కూడా వెతుక్కుని ముందుకు సాగితే, కష్టాల నుంచి ఎప్పటికప్పుడు సాంత్వన లభిస్తుంది. ఎవరూ చెప్పకపోయినా, ఈ విషయాలు వివాహమైన కొంత కాలానికి ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వస్తాయి. ఆ పాటికే ఎన్నో పెళ్లిళ్లు విడాకుల దిశగా నడుస్తుంటాయి. అదే ముందుగా తెలుసుకుని జాగ్రత్త పడితే, ఆ ప్రమాదం ఉండదు.

More Telugu News