: పితృత్వ సెలవులో ఫేస్ బుక్ చీఫ్... రెండు నెలల పాటు కూతురితోనే అంటున్న జుకెర్ బర్గ్

మహిళలకు మెటర్నిటీ సెలవుల్లాగే కొత్తగా తండ్రులవుతున్న పురుషులకు పెటర్నిటీ సెలవు కూడా ఉండాల్సిందేనంటున్నారు ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకెర్ బర్గ్. చెప్పడమే కాదు, తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు నాలుగు నెలల పాటు మెటర్నిటీ లీవుతో పాటు అంతే వ్యవధి కలిగిన పెటర్నిటీ లీవులను ఇచ్చేందుకు ఆయన నిబంధనలను కూడా రూపొందించారు. ఈ సెలవును ఆయన కంపెనీ ఉద్యోగులు వినియోగించుకున్నారో, లేదో తెలియదు కాని... ఆయన మాత్రం ఆ సెలవును వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. నాలుగు నెలలు కాకుండా రెండు నెలల పాటు పితృత్వ సెలవును తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. జుకెర్ బర్గ్ భార్య ప్రిస్కిల్లా త్వరలో చిన్నారికి జన్మనివ్వనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డెలివరీ టైం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇదే విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్న జుకెర్ బర్గ్ ఇప్పటికే తన కూతురు కోసం ఓ బీస్ట్ బొమ్మతో పాటు బేటీ సీటును కూడా కొనుగోలు చేశాడు. ఈ మేరకు తాను పెటర్నిటీ లీవు తీసుకుంటున్న విషయంతో పాటు కూతురు కోసం కొన్న వాటిని ఆయన తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. చిన్నప్పుడు పిల్లలతో తల్లిదండ్రులు కలిసి ఉంటే, భవిష్యత్తులో సదరు చిన్నారులు మెరుగ్గా రాణిస్తారని జుకెర్ బర్గ్ విశ్వాసం. ఈ ఆలోచనతోనే ఆయన తన కంపెనీ ఉద్యోగులకు మెటర్నిటీ లీవుతో పాటు పెటర్నిటీ లీవును కూడా అందుబాటులోకి తెచ్చారు.

More Telugu News