: నెలకు రూ. 2 వేల కన్నా తక్కువ ఖర్చుతో చేయగలిగే ఐదు స్మార్ట్ పనులు!

రోజురోజుకూ మారుతున్న డిజిటల్ ఎకానమీతో ఖర్చు విషయంలో మన అలవాట్లూ మారుతున్నాయి. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ తప్పనిసరైపోయింది. ఇంకాస్త డబ్బుంటే కారు, విదేశీ టూర్లు కూడా కంటిముందుంటాయి. ఈ పరిస్థితుల్లో శాలరీ ఖాతాలో ఉన్న డబ్బు నుంచి 'సున్నా'లు ఒక్కొక్కటిగా మాయం కావడం ఎంతో మందికి అనుభవమే. అనవసరంగా అదుపు తప్పే ఖర్చును ఆపడం ఎలాగని ఆలోచించని వారుండరు. ఇదే సమయంలో నెలకు రూ. 2 వేల కన్నా తక్కువ ఖర్చుతో ఉపయోగపడే పనులు ఎన్నో చేయవచ్చంటున్నారు నిపుణులు. ఈ విషయంలో ఇటీవల ఓ సర్వే నిర్వహించగా, అందులో వచ్చిన టాప్-5 స్మార్ట్ పనులివి. ఫేస్ బుక్ పక్కన పెట్టి లోకజ్ఞానం పెంచుకోవడం: 'నాలెడ్జ్ ఈజ్ డివైన్' అన్నది నానుడి. ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో పనికిరాని చాటింగ్ లతో కాలం గడపడం బదులు పుస్తకాలు కొనుక్కుని చదవాలన్నది అత్యధికులు అంగీకరించిన స్మార్ట్ ఐడియా. సంవత్సరానికి రూ. 1,450తో ఫోర్బ్స్, రూ. 900తో ది ఎకానమిస్ట్ మీ తలుపు దగ్గరకు వచ్చేస్తాయి. ఇక రీడర్స్ డైజస్ట్ రూ. 549కే లభిస్తుంది. వీటిని చదవడం ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతోందన్న విషయాలపై ఎంతో అవగాహన లభిస్తుంది. ఓ రిటైర్ మెంట్ ప్లాన్: పదవీ విరమణ తరువాత మరింత సౌకర్యవంతంగా జీవించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ, కాస్తంత ముందుగానే నెలకో రూ. 2 వేలు రిటైర్ మెంట్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే, వీటిపై వచ్చే రాబడి దీర్ఘకాలంలో ఎంతో సౌఖ్యాన్నిస్తుంది. ఆన్ లైన్ లో ఈ తరహా ప్లాన్ లు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. మెచ్యూరిటీ తరువాత పన్ను రాయితీలు అదనపు ఆకర్షణ. కొత్త నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు: మారుతున్న కాలానికి, అందివస్తున్న టెక్నాలజీకి అప్ డేట్ కాకుంటే, వెనుకబడిపోవడం ఖాయం. ప్రపంచాన్ని మార్చేంత శక్తి వున్న ఎన్నో టెక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సెరా, ఈడీఎక్స్ వంటి వెబ్ సైట్లలోకి వెళ్లి, మీకు అవసరపడుతుందని అనుకున్న కోర్సుల ప్యాకేజీని రూ. 2 వేల కన్నా తక్కువ ధరలోనే కొనుక్కోవచ్చు. ఇవి భవిష్యత్తులో మీ ప్రమోషన్లకు కూడా ఉపయోగపడతాయి. మరింత ఆరోగ్యవంతులు కావచ్చు: నెలకు కేటాయించిన రూ. 2 వేలల్లో ఓ వెయ్యి బలవర్థక ఆహారానికి, మరో వెయ్యి జిమ్ కు కేటాయిస్తే, మీ ఆరోగ్యం మరింతగా పెరుగుతుంది. రోజుకు రూ. 30తో లభించే ఏవైనా ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోవచ్చు. ఆపై జిమ్ కు వెళ్లి కాసేపు గడపడం ద్వారా శరీరాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం కదా? కొత్త భాషను నేర్చుకోండి: మీకు తెలియని, ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉన్న ఓ భాషను నెలకు రూ. 2 వేల కన్నా తక్కువ ఖర్చుతో నేర్చుకోవచ్చు. కొన్ని భాషలను ఉచితంగా నేర్పే వెబ్ సైట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్రెంచ్, జర్మనీ, చైనా, జపాన్ వంటి దేశాల భాషల్లో మీకు నచ్చిన ఏదో ఒకటి ఎంచుకుని నేర్చుకుంటే, నలుగురిలో మీరు ప్రత్యేకులుగా మిగులుతారనడంలో సందేహం లేదు.

More Telugu News