: ఏ వయసులో ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే..!

ఒక్కో వయసులో ఒక్కోలా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళితే, భవిష్యత్తులో ఇబ్బందులు లేని జీవితం గడపవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో వస్తున్న ఆదాయం, ప్రాధాన్యతలు, ఖర్చు పెట్టే అలవాట్లు కూడా మార్చుకుంటూ వెళ్లాలని సూచిస్తున్నారు. ఒక్కసారి చిన్నతనాన్ని ఊహించుకోండి. అప్పుడు ఉన్నట్టుగానే, అప్పుడు దుస్తులు ధరించిన విధంగానే ఇప్పుడు ఉంటున్నారా? లేదు కదా? సమయం గడిచేకొద్దీ జీవనగమనం ఎలా మారుతుందో, పెట్టుబడుల విధానమూ అదే విధంగా మారాల్సి వుంటుంది. పెట్టుబడి పెట్టాలంటే, ముందుగా ఆదాయం రావాలి. అంటే ఏదో ఓక రూపంలో నెలకు ఇంతని పొందుతుండాలి. ఎంత తక్కువ వయసులో పెట్టుబడి మెదలు పెడితే, అంత ఎక్కువ రాబడిని పొందవచ్చు. తక్కువ ఏజ్ ఉన్నప్పుడు రిస్క్ ఎక్కువగా ఉండే పథకాలను ఎంచుకుని మరింత రాబడి పొందవచ్చు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు, మీపై ఆదారపడి వుండేవాళ్లు ఎవరూ ఉండరు. దీర్ఘకాల ఇన్వెస్ట్ మెంట్స్ ఎంచుకోవచ్చు. సంపాదనలో 60 నుంచి 70 శాతాన్ని సేవింగ్స్ చేసుకుంటూ యూలిప్ బాండ్లు, పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, లైఫ్ ఇన్స్యూరెన్స్ పథకాల్లో పెట్టుబడులు తప్పనిసరి. ఇక వివాహం అయిన తరువాత గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఆర్థికంగా మీపై ఆధారపడిన వారుంటారు. ఖర్చులు పెరుగుతుంటాయి. ఈ సమయంలో సమీపకాలంలో రిస్క్ ఉంటుందని భావించిన పథకాల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. చేతిలో లిక్విడ్ క్యాష్ కూడా ఉండాలి. ఈ దశలో 30 నుంచి 50 శాతం ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. డెట్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, ఈక్విటీల్లో మదుపు చేయవచ్చు. తండ్రి అయిన తరువాత, ఖర్చులు మరింతగా పెరిగి, అసలు రిస్క్ తీసుకునే అవకాశమే లభించదు. ఈ దశలో సంపాదనలో 30 శాతమే సేవింగ్స్ చేయగలుగుతారు. హెల్త్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్, యూలిప్, బంగారం, చైల్డ్ ప్లాన్స్ లో పెట్టుబడులు మేలు చేకూరుస్తాయి. ఇక పదవీ విరమణ వేళ, మీ పెట్టుబడులన్నీ ఓ సారి సమీక్షించుకోవాలి. ఖర్చుల కోసం అధిక డబ్బు అందుబాటులో ఉంచుకుని, స్వల్పకాల పెట్టుబడులకే ప్రాధాన్యత ఇవ్వాలి. వచ్చే ఆదాయంలో 20 శాతం మొత్తాన్ని సీనియర్ సిటిజన్స్ స్కీముల్లో, పెన్షన్ ప్లాన్లలో, ఫిక్సెడ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు.

More Telugu News