: పాత వ్యూహమే మేలు... ఫ్లిప్ కార్ట్ యూటర్న్!

ఇకపై కేవలం మొబైల్ మాధ్యమంగానే ఆన్ లైన్ విక్రయాలు సాగిస్తామని, వెబ్ సైట్ ను త్వరలో మూసివేస్తామని గతంలో ప్రకటించిన ఫ్లిప్ కార్ట్ యూటర్న్ తీసుకోనుందని సమాచారం. ఈ పండగ సీజనులో వెబ్ సైట్ అమ్మకాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా, మొబైల్ యాప్ ప్రమోషన్ పేరిట అధిక అఫర్లను ఇచ్చినప్పటికీ, సంస్థ అమ్మకాలు ఆశించినంతగా పెరగలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాత వ్యూహమే మేలని, వెబ్ సైట్ లో కూడా, యాప్ కు సమానంగా ఆఫర్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం మొబైల్ వెబ్ ఆప్షన్ పెట్టుకుని 'ఫ్లిప్ కార్ట్ లైట్' పేరిట తక్కువ డేటా తీసుకుంటూ, సులువుగా తెరచుకునే వెబ్ వర్షన్ ను తయారు చేస్తోంది. స్మార్ట్ ఫోన్లలో యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవడం ఇష్టం లేని వారికి ఇది ఉపయుక్తకరంగా ఉంటుందన్నది తమ అభిమతమని ఫ్లిప్ కార్ట్ ఇంజనీరింగ్ హెడ్ పీయుష్ రంజన్ వ్యాఖ్యానించారు. "మేము యాప్ ను మరింతగా ప్రోత్సహించాలనుకున్నాం. ఈ సీజనులో ఫ్లిప్ కార్ట్ లో ప్రొడక్టులను కొనుగోలు చేసిన వారిలో కేవలం 4 శాతం మాత్రమే యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్నారు. ఫలితంగా మేము మా వ్యూహాన్ని మార్చుకోక తప్పనిసరి పరిస్థితి. అందుకోసం మొబైల్ వెబ్ సైట్ ను పరిచయం చేయాలని నిర్ణయించాం" అని రంజన్ వివరించారు. ఇందుకోసం క్రోమ్, ఒపేరా వంటి బ్రౌజర్లతో కలసి పనిచేస్తున్నామని, త్వరలోనే ఫైర్ ఫాక్స్ తో కూడా సంప్రదింపులు జరుపుతామని తెలిపారు.

More Telugu News