: తిండి మానక్కర్లేదు, కసరత్తులు అసలే వద్దు... సన్నబడటం చాలా ఈజీ అట!

లావుగా ఉన్నామని బాధపడుతున్న వారికి జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్న శుభవార్త ఇది. అందమైన శరీరాకృతిని కోరుకుంటూ పొట్ట మాడ్చుకోనవసరం లేదట. అంతేకాదు. చెమటలు పట్టేలా వ్యాయామాలూ అవసరం లేదని అంటున్నారు. ఇక సన్నగా ఎలా అవుతాము? అని ప్రశ్నిస్తున్నారా? ఓ బస్సెక్కితే, లేదా రైలెక్కి ప్రయాణం చేస్తే చాలట. బస్సులు, రైళ్లలో ప్రయాణించేవారు సులువుగా సన్నబడుతున్నారని, మిగతావారితో పోలిస్తే, వీరికి ఊబకాయం వచ్చే అవకాశాలు 44 శాతం తక్కువని శాస్త్రవేత్తలు అంటున్నారు. బరువు తగ్గాలని అనుకుంటూ, రెండు మూడు కిలోమీటర్లు నడిచి, ఆపై ఇల్లు చేరి విశ్రాంతి తీసుకునే వారికంటే, ఆఫీసులకు వెళ్లి పనిచేసే వారు అధికంగా శ్రమపడతారని, వారు ఇంటి నుంచి స్టేషన్ కు, లేదా వాహనం ఎక్కి ఆఫీసుకు వెళ్లి, అక్కడ నడిచే దూరమే తెలియకుండా మూడు కిలోమీటర్లను దాటి పోతుందని అంటున్నారు. దీని వల్ల ఊబకాయం దూరం కావడంతో పాటు బీపీ వచ్చే అవకాశాలు 27 శాతం వరకూ, షుగర్ వచ్చే అవకాశం 34 శాతం వరకూ తగ్గుతాయని కూడా తెలిపారు. మొత్తం 5,908 మందిని తమ అధ్యయనంలో భాగం చేసి ఈ విషయాన్ని కనుగొన్నామని శాస్త్రవేత్తలు వివరించారు.

More Telugu News