: 'బీహార్' ప్రభావం నుంచి బాగా రికవర్ అయిన స్టాక్ మార్కెట్లు!

స్టాక్ మార్కెట్ సెషన్ ఆరంభంలో భయపెట్టిన బీహర్ ఎన్నికల ఫలితాల ప్రభావం సమయం గడిచేకొద్దీ తేలిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్న వేళ, భారత మార్కెట్లో స్పష్టమైన రికవరీ కనిపించింది. ఆ రికవరీ లాభాల్లోకి నడవలేనప్పటికీ, సెషన్ గడిచేకొద్దీ పలు కంపెనీల ఈక్విటీల్లో నష్టం గణనీయంగా తగ్గిపోయింది. లార్జ్ కాప్ సెక్టార్లు లాభం నమోదు చేయడంలో విఫలమైన వేళ, స్మాల్, మిడ్ కాప్ కంపెనీలు దూసుకెళ్లాయి. ఇక నేటి సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ 143.84 పాయింట్లు పడిపోయి 0.55 శాతం నష్టంతో 26,121.40 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 39.10 పాయింట్లు పడిపోయి 0.49 శాతం నష్టంతో 7,915.20 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.42 శాతం, స్మాల్ క్యాప్ 0.78 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 18 కంపెనీలు మాత్రమే లాభాల్లో నడిచాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా మోటార్స్, మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్, పీఎన్బీ తదితర కంపెనీలు లాభపడగా, సన్ ఫార్మా, బీహెచ్ఈఎల్, కెయిర్న్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, ఐడియా తదితర కంపెనీలు నష్టపోయాయి. ఈ సెషన్లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 97,38,067 కోట్లకు తగ్గింది. మొత్తం 2,704 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా,1,432 కంపెనీలు లాభాలను, 1,151 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

More Telugu News