: మన దేశం 'బంగారం' ... పేద దేశం ఎలా అవుతుంది?: ప్రధాని మోదీ

ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం నిల్వలు ఉన్న దేశాల్లో ఒకటిగా ఉన్న ఇండియా పేద దేశం ఎలా అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. ఇండియాలోని ఇళ్లలో దాదాపు 20 వేల టన్నుల బంగారం ఉందని గుర్తు చేసిన ఆయన, దాన్ని సక్రమంగా వినియోగించి ఉంటే, ఇండియా ఎప్పుడో అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచి వుండేదని అభిప్రాయపడ్డారు. ఈ ఉదయం బంగారం నగదీకరణ సహా మూడు గోల్డ్ స్కీములను ఆయన ప్రారంభించారు. తమ వద్ద ఉన్న బంగారాన్ని దేశాభివృద్ధికి ఎలా వినియోగించాలన్న విషయమై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్రం కృషి చేస్తుందని తెలిపారు. బంగారం డిపాజిట్లకు పెద్దఎత్తున స్పందన వస్తుందని తెలిపిన ఆయన, మహిళలకు బంగారంపై ఎంత సెంటిమెంటు ఉన్నదో తనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. గృహాల్లో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని మాత్రమే బ్యాంకుల్లో పెట్టుబడిగా పెట్టినా, కనీసం 5 నుంచి 6 వేల టన్నుల బంగారం వస్తుందని, దీంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని నరేంద్ర మోదీ తెలిపారు. మహిళలు ముందుకు వస్తేనే తన ఆలోచన విజయవంతమవుతుందని అన్న ఆయన, గతంలో జన్ ధన్ యోజన భారతీయ మహిళల కారణంగానే విజయం సాధించిందని గుర్తు చేసుకున్నారు. వృథాగా పడివున్న బంగారాన్ని వాడుతూ, మరిన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. ఈ సందర్భంగా అశోక చక్రం, జాతి పిత మహాత్మా గాంధీ చిత్రాలున్న బంగారు నాణాలను వివిధ డినామినేషన్లలో మోదీ, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ లు విడుదల చేశారు.

More Telugu News