: ఇండియాలో విచిత్ర స్థితి... అమ్మకాలు తగ్గినా కంపెనీల లాభాల బాట, ప్రజలకు ప్రయోజనం శూన్యం!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగ భాగం ముగిసింది. రెండవ త్రైమాసికంలో అంటే, జూలై నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో భారత పరిశ్రమల అమ్మకాలు తగ్గగా, లాభాలు గణనీయంగా పెరిగాయి. వివిధ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయ స్థాయిలో కమోడిటీ ధరలు దిగిరావడం ఇందుకు కారణాలు. సోమవారం నాటి వరకూ ఇండియాలో లిస్టింగ్ అవుతున్న కంపెనీల్లో 662 తమతమ క్యూ-2 ఫలితాలను వెల్లడించాయి. 2014-15 సంవత్సరంతో పోలిస్తే, సగటున ఈ కంపెనీల నికర అమ్మకాలు 4.4 శాతం తగ్గాయి. గత ఎనిమిదేళ్ల వ్యవధిలో ఇది రెండో అత్యల్పం. ఇక నికర లాభం మాత్రం సరాసరిన 7.7 శాతం పెరిగింది. ఇది గడచిన నాలుగు త్రైమాసికాల్లో అత్యదికం. నికర అమ్మకాలు దిగజారడానికి తగ్గిన పెట్రోలియం ఉత్పత్తుల ధరలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు. పెట్రోలియం సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, కెయిర్న్ ఇండియా, ఎంఆర్పీఎల్, పెట్రొనెట్ ఎల్ఎన్జీ సంస్థలను తొలగించి చూస్తే, సెప్టెంబరు త్రైమాసికంలో నికర లాభం 10.1 శాతం పెరిగినట్టు. ఇక ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్షియల్ కంపెనీలను తొలగించి పరిశీలిస్తే నెట్ ప్రాఫిట్ ఏడు శాతానికి పైగా పెరిగింది. కంపెనీల నిర్వహణా స్థాయిలో ఇది శుభవార్తే. ఈ సంస్థల నిర్వహణా లాభాలు 23 త్రైమాసికాల తరువాత, అంటే, దాదాపు ఆరేళ్ల తరువాత 18.9 శాతానికి పెరిగాయి. 2009లో అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో ఆనాటి ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కే తొలి అడుగుల్లో 20 శాతం వరకూ భారత కంపెనీలు ఆపరేటింగ్ ప్రాఫిట్ ను నమోదు చేశాయి. కాగా, ముడి పదార్థాల ధరలు తగ్గినప్పటికీ, ఆ ప్రయోజనాలను కస్టమర్లకు దగ్గర చేయడంలో పలు కంపెనీలు వెనుకంజ వేస్తున్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఈ ధోరణి కనిపిస్తోంది. మార్జిన్లు పెరుగుతున్నా ఎన్నో ప్రొడక్టుల ధరలు ఇంకా తగ్గలేదని యూటీఐ ఏఎంసీ ఫండ్ మేనేజర్ స్వాతి కులకర్ణి అభిప్రాయపడ్డారు.

More Telugu News