: భయానికి విరుగుడు... పసుపు!

భారతీయుల జీవన విధానంలో భాగమైన ఎన్నింటిలోనో ఔషధ గుణాలున్నట్టు బాహ్యప్రపంచానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. గతంలో పల్లెల్లో చిన్నపిల్లలకి పసుపు, వేప కలిపిన ముద్దను గోళీలుగా చేసి తినిపించేవారు. దాని వల్ల పలురోగాలు పిల్లల దరి చేరవని నమ్మేవారు. ఇప్పుడీ పసుపు 'భయానికి' మంచి విరుగుడని పరిశోధకులు పేర్కొంటున్నారు. మనం కూరల్లో వాడే పసుపు భయాన్ని పారద్రోలుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భయం కలిగినప్పుడు మెదడు పనితీరు ఎలా ఉంటుందనే దానిపై అమెరికన్ కెమికల్ సొసైటీ పలు పరిశోధనలు నిర్వహించింది. హారర్ సినిమాలు చూసినప్పుడు లేదా భయంకరమైన అనుభవాన్ని చవిచూసినప్పుడు కొంత మంది ఆ సందర్భాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నించగా, మరి కొందరు ఆ సంఘటనా స్థలి నుంచి దూరంగా పారిపోయారు. దీనికి కారణం మెదడులోని థలామస్ భయాన్ని నియంత్రించడమే. మెదడులో సున్నితంగా ఉండే థలామస్ మానసిక, శారీరక ఉద్రిక్తతలకు సెన్సర్ లా పనిచేస్తుందట. ఇందులోని పెరియాక్వడక్టల్ గ్రే ప్రాంతానికి ఏదైనా సిగ్నల్ వచ్చినప్పుడు ఓ స్విచ్ లా పని చేస్తుంది. ఒత్తిడి, భయంకరమైన అనుభవాలు కలిగినప్పుడు అడ్రినల్ గ్రంధులు స్పందించి అడ్రినలిన్ ను బయటకు తోస్తాయి. ఈ చర్యల కారణంగా ఉలికిపాటు కలిగి మెదడులో స్పందనలు ప్రారంభమవుతాయి. దీంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆలోచనల్లో వేగం పెరుగుతుంది. దీంతో శరీరంలో భారీ మొత్తంలో శక్తి ఉత్పత్తికావడంతో ఆ సందర్భాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తుంది. అలా కాకుండా ఒత్తిడి తీవ్రంగా ఉంటే మెదడు మొద్దుబారిపోతుంది, వెంటనే ఆ భయానక పరిస్థితిని అంచనా వేసి అక్కడి నుంచి పలాయనం చిత్తగించేలా చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతోనే మన మీద ఎవరైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు, అక్కడి నుంచి తప్పించుకునేందుకు పారిపోతుంటామని, అలాంటాప్పుడే అప్రయత్నంగా కేకలు కూడా వేస్తుంటామని వారు వివరించారు. ఇలాంటి భయాన్ని పారద్రోలడంలో పసుపు కీలకమైన పాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మెదడులో గూడుకట్టుకున్న భయాన్ని కూడా పసుపు పారద్రోలుతుందని వారు వెల్లడించారు. మానసికరుగ్మతలతో బాధపడేవారి ఆహారంలో పసుపును భాగం చేస్తే అద్భుతమైన ఫలితాలొస్తాయని వారు చెబుతున్నారు.

More Telugu News