: స్టార్టప్ కంపెనీల్లో అత్యధికం విఫలమే: ఇన్ఫీ మాజీ డైరెక్టర్

ఒకవైపు వినూత్న ఆలోచనలతో పుట్టుకొస్తున్న స్టార్టప్ కంపెనీల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంటే, ఈ తరహా సంస్థల్లో అత్యధికం విజయానికి ఆమడ దూరంలో ఉంటున్నాయని, కేవలం 10 శాతం కంపెనీలు మాత్రమే ముందడుగు వేస్తున్నాయని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. ఈ చిన్న సంస్థలను ప్రోత్సహించి, మరిన్ని కంపెనీలు విజయం సాధించేలా ప్రభుత్వాలు అనుకూల వాతావరణం కల్పించాలని ఆయన కోరారు. గత మూడు నాలుగేళ్లలో ప్రారంభమైన కంపెనీల్లో 10 శాతం లాభాల్లో ఉండగా, 25 శాతం కంపెనీలు పెట్టుబడులను తిరిగి తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాయని, మిగతావి ఫెయిల్యూర్ అయ్యాయని ఆయన అన్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన 'డిజిటల్ ఇండియా' ప్రచారం మరో అడుగు ముందుకేస్తే, వచ్చే పదేళ్లలో లక్ష కొత్త కంపెనీలు ఇండియాకు వస్తాయని, వీటి ద్వారా 35 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, వీటి విలువ 500 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 32 లక్షల కోట్లు) ఉంటుందని మోహన్ దాస్ అంచనా వేశారు. సరైన దిశలో మోదీ తన ఆలోచనలను నడిపించడంలో విజయం సాధిస్తే, ఇండియా సాంకేతికంగా పెను మార్పులను సంతరించుకుంటుందని తెలిపారు. భారతీయులు అందరూ వైర్ లెస్ పరికరాల ద్వారా కనెక్ట్ కావాల్సి వుందని, ఆరవ తరగతి నుంచి అందరు విద్యార్థులు 3జీతో కూడిన ఇంటర్నెట్ ద్వారా ట్యాబ్ లను వాడాలని ఆయన అభిలషించారు. అది సాధ్యమైతేనే తదుపరి 15 సంవత్సరాల్లో ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందని అన్నారు. ప్రస్తుతం ఇండియాలో 18 వేల స్టార్టప్ సంస్థలు 3 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయని తెలిపారు. ఈ కంపెనీలు విఫలమైనా, యజమానులకు రక్షణ కల్పించేలా దివాలా చట్టానికి సవరణలు చేయాలని, అప్పుడే మరిన్ని వినూత్న ఆలోచనలతో కొత్త కంపెనీలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News