: ఇవి తీసుకుంటే తలనొప్పి రావడం ఖాయమట!

తలనొప్పి... ప్రతి ఒక్కరికీ అనుభవమే. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది. సాధారణంగా మానసికంగానో, శారీరకంగానో అలసిపోతే వచ్చే తలనొప్పి, మీరు తీసుకునే ఆహార పదార్థాల కారణంగా కూడా రావచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదా? నిజమే! మీరు తాగే బేవరేజస్, తినే తిండి కూడా తలనొప్పికి కారణాలని డైటీషియన్లు చెబుతున్నారు. ఒక్కసారిగా తినే తిండిని మార్చినా, తక్కువ కాలరీలున్న ఆహార పదార్థాలను తీసుకున్నా, లావైపోతామేమోనని కార్బోహైడ్రేట్లను తగ్గించినా, భోజన విరామం పెరిగినా తలనొప్పి వచ్చేస్తుందని చెబుతున్నారు. దీంతో పాటు... * రెడ్ వైన్, చీజ్ వంటి వాటిల్లో ఉండే టైరమైన్ తలనొప్పిని తెచ్చి పెడుతుంది. శరీరంలోని సెరొటోనిన్ (దీన్నే హ్యాపీ హార్మోన్ అని కూడా పిలుస్తారు) తగ్గితే హెడేక్ వస్తుందట. * ఇక కొంతమంది ఏ విధమైన ఆల్కహాల్ ను తీసుకున్నా తలనొప్పికి గురవుతారు. బీరు తాగినా, విస్కీ, వైన్ తీసుకున్నా శరీరంలో టైరమైన్ పెరిగిపోయి, మెదడులో రక్త ప్రసారం నిదానించి తలనొప్పితో బాధపడాల్సి వస్తుంది. * ఇక మహిళల్లో హార్మోన్లు మారుతున్న సమయంలోనూ, ఒత్తిడిలో ఉన్నప్పుడూ చాక్లెట్లు తింటే తలనొప్పి వస్తుందట. లావుగా ఉన్నామని భావిస్తూ, ఒక్కసారిగా తినే తిండి తగ్గించినా, వీరిలో హెడేక్ ఖాయం. * రోజుకు నాలుగైదు సార్లు కాఫీ తాగేవారు ఒకరోజు దానికి దూరమైనా తలనొప్పితో బాధపడక తప్పదని నిపుణులు తేల్చారు. తాత్కాలికంగా మనసును ఆహ్లాదపరిచి, ఉత్సాహాన్ని అందించే కాఫీకి దూరమైతే, మైగ్రేన్ హెడేక్ వస్తుంది. * శరీరంలో చక్కెర నిల్వలు తగ్గితే, దాని ప్రభావం మొదట తలనొప్పి రూపంలో బయట పడుతుంది. రోజుకు చాలినంత చక్కెర తీసుకోనివారు బాధపడక తప్పదు. మీకు పలుమార్లు తలనొప్పి వస్తోందని భావిస్తుంటే, తొలుత ఆహారపు అలవాట్లలో తేడా ఉందేమో పరిశీలించుకోండి. అయినా, తలనొప్పికి, తీసుకునే ఆహారానికి సంబంధం లేదని భావిస్తుంటే, సాధ్యమైనంత త్వరగా డాక్టరును సంప్రదించమని సలహా.

More Telugu News