: విలీనం దిశగా ఆర్ కాం, ఎయిర్ సెల్, ఎంటీఎస్... కలిస్తే మూడవ అతిపెద్ద టెల్కో!

ఇండియాలో వినియోగదారుల పరంగా టాప్-3 టెలికం సంస్థగా ఆవిర్భవించాలన్న కోరికతో ఉన్న అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఆ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. ఎయిర్ సెల్, సిస్టెమా (ఎంటీఎస్)లను విలీనం చేసుకోవాలన్నది ఆర్ కాం అంచనా. వాటాల జారీ విధానం ద్వారా వీటిని కలుపుకోవాలని చూస్తున్న సంస్థ ప్రస్తుతం ప్రాథమిక చర్చలు ముగించి, రెండవ దశ చర్చల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీల మధ్య వాటాల పంపిణీపై అధికారుల సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏ కంపెనీకి ఎంత అప్పులున్నాయన్న విషయం వాటాల విభజనకు ప్రధాన అడ్డంకిగా ఉన్నట్టు సమాచారం. ఈ విషయంలో స్పష్టత ఏర్పడితే, విలీనం కోసం వాటాదారులు, షేర్ హోల్డర్ల అనుమతి కోరాలని, ఆపై డాట్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం)కు విషయం తెలియజేయాలని భావిస్తున్నట్టు ఆర్ కాం ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం ఆర్ కాంకు రూ. 38 వేల కోట్ల మేరకు రుణాలున్నాయి. మరోవైపు ఎయిర్ సెల్ కు అనుమతులున్న 4జీ తరంగాలను పంచుకోవాలన్న దిశగా ఎయిర్ టెల్ సైతం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఒకవైపు ఎయిర్ టెల్, మరోవైపు ఆర్ కాం, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు వస్తుండటంతో ఆచితూచి అడుగులు వేయాలని ఎయిర్ సెల్ భావిస్తోంది.

More Telugu News