: ఏటీఎంల్లో డబ్బు అయిపోక ముందే త్వరపడండి... బ్యాంకులకు ఐదు రోజుల సెలవులు

వచ్చే వారం రోజుల వ్యవధిలో మీకు అవసరమనుకున్న డబ్బులను ఇప్పుడే ఏటీఎంల నుంచి తీసేసుకోండి. లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే, భారత బ్యాంకింగ్ రంగం వరుస సెలవుల 'మూడ్' లోకి వెళ్లనుంది. రేపు దుర్గాపూజ, ఎల్లుండి దసరా, మరుసటి రోజు మొహర్రం, ఆపై నాలుగో శనివారం (ప్రభుత్వ బ్యాంకులకు రెండు, నాలుగో శనివారాలు పూర్తి సెలవు), తరువాతి రోజు ఆదివారం. ఇండియాలోని అత్యధిక రాష్ట్రాల్లో ఈ ఐదు రోజుల పాటూ ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ రాష్ట్రాల్లో నేటి సాయంత్రం తరువాత ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలలో నగదు నింపిన తరువాత, తిరిగి సోమవారం నాడు మాత్రమే నగదు పెట్టేందుకు ఉద్యోగులు రానున్నారు. సాధారణంగా ఏ ప్రధాన ప్రాంతాల్లోని ఏటీఎంలలో రెండు రోజుల్లోనే నగదు అయిపోతుంటుంది. ఇక వరుస సెలవులు వస్తే... కాగా, తెలంగాణలో నేడు సద్దుల బతుకమ్మ కారణంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించినప్పటికీ, బ్యాంకులకు సమాచారం లేదని, తెలంగాణలో వరుసగా బ్యాంకులు మూతపడటం లేదని అధికారులు తెలిపారు. 22న దసరా తరువాత, 24, 25 తేదీల్లో బ్యాంకులు పనిచేయవని ఓ అధికారి తెలిపారు. అంటే తెలంగాణలో మంగళ, బుధ, శుక్ర వారాల్లో బ్యాంకులు పనిచేయనున్నాయి. ఇక అత్యవసరంగా నగదు అవసరమయ్యే వారు రూ. 20 పెట్టి (ఇతర బ్యాంకుల నుంచి మూడు సార్లు డబ్బు తీసుకుంటే) ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలను ఆశ్రయించవచ్చని సలహా. ఎందుకంటే, ఈ బ్యాంకుల ఏటీఎంలలో శనివారం నాడు డబ్బు నింపుతారు కాబట్టి.

More Telugu News