: జియోమీ కొత్త ఆఫర్, రూ. 20,500కు సెల్ఫ్ బ్యాలెన్సింగ్ స్కూటర్

చైనా టెక్ దిగ్గజం జియోమీ తాజాగా 'నైన్ బాట్ మినీ' పేరిట సెల్ఫ్ బ్యాలెన్సింగ్ స్కూటర్ ను విడుదల చేసింది. దీంతో పాటు 'ఎంఐ టీవీ' పేరిట 60 అంగుళాల 4కే స్మార్ట్ టీవీని విడుదల చేస్తున్నట్టు తెలిపింది. నైన్ బాట్ మినీతో తాము ద్విచక్ర వాహన సెగ్మెంట్ లోకి ప్రవేశించామని సంస్థ వెల్లడించింది. "దాదాపు సంవత్సరం క్రితం దీని తయారీకి పెట్టుబడులు పెట్టాము. అమెరికాకు చెందిన సెగ్వే సంస్థతో కుదుర్చుకున్న డీల్ లో భాగంగా దీన్ని తయారు చేశాము" అని వివరించింది. దీని ధర 1,999 యువాన్లని (సుమారు రూ. 20,500) పేర్కొంది. కేవలం 12.8 కిలోల బరువుండే ఈ చిన్ని స్కూటర్ ను ఏరోస్పేస్ గ్రేడ్ మెగ్నీషియమ్ తో తయారు చేశామని, ఒకసారి చార్జింగ్ తో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో 22 కిలోమీటర్ల దూరం వెళుతుందని తెలిపింది. దీనిని స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా నియంత్రించవచ్చని, స్పీడోమీటర్, ట్రాఫిక్ డేటా వంటి సదుపాయాలున్నాయని పేర్కొంది. ఇక ఎంఐ టీవీ 3 విషయానికి వస్తే దీని ధర 4,999 యువాన్లు (సుమారు రూ. 51,000). వీటి అమ్మకాలు నవంబర్ 3 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ రెండింటితో పాటు రూ. 1000 ధరలో బ్లూటూత్ వాయిస్ రిమోట్ కంట్రోల్, రూ. 6,100 ధరలో ఎంఐ సబ్ వూఫర్ లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.

More Telugu News