: ఇండియాలో అధికారులకు కోట్లాది రూపాయల లంచాలిచ్చిన వాల్ మార్ట్... 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' సంచలన కథనం

ఇండియాలో కాంట్రాక్టులను సంపాదించడం కోసం మల్టీనేషనల్ రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్, అధికారులకు కోట్లాది రూపాయల లంచాలను ఇచ్చిందన్న అనుమానాలున్నాయని అమెరికన్ పత్రిక 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. స్థానిక అధికారుల నుంచి వస్తువుల రవాణాకు మార్గం సుగమం చేసుకునేందుకు, నిర్మాణ రంగంలో అనుమతులు తెచ్చుకునేందుకు లంచాలిచ్చిందని పత్రిక ఆరోపించింది. పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం 5 డాలర్లు (సుమారు రూ. 300) నుంచి 200 డాలర్లు (సుమారు రూ. 1.2 లక్షలు) వరకూ లంచాలిచ్చిందని, అధికారుల స్థాయిని బట్టి ఈ మొత్తం పెరిగి ఉండవచ్చని వెల్లడించింది. గతంలో ఇండియాలో ఒంటరిగా వ్యాపారం చేయాలని భావించిన సంస్థ యూఎస్ కాంగ్రెస్ లో సైతం లాబీయింగ్ చేసినట్టు వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ, ఇప్పుడు ఇండియాలో భారతీ ఎంటర్ ప్రైజస్ తో కలసి ఆ సంస్థ రిటైల్ విభాగంలో బిజినెస్ చేస్తోందని తెలిపింది. వాల్ మార్ట్ లంచాలు ఇచ్చినట్టు తేలినా, ఎటువంటి జరిమానాలు పడే అవకాశాలు లేవని తెలియజేస్తూ, భారత కార్యకలాపాల ద్వారా సంస్థ అమెరికన్ చట్టాలకు వ్యతిరేకంగా ఎటువంటి లాభాలనూ అందుకోకపోవడమే కారణమని అభిప్రాయపడింది. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్సీపీఏ) చట్టం ప్రకారం, ఇండియాలో వాల్ మార్ట్ పొందుతున్న లాభాలన్నీ చట్టపరిధిలోనివేనని పేర్కొంది. "ఇండియాలో వాల్ మార్ట్ లంచాలు ఇచ్చినట్టు నిఘా అధికారుల వద్ద ఆధారాలు ఉన్నాయి. ఎంతో మంది లోకల్ అధికారులకు చిన్న మొత్తాల రూపంలో సంస్థ ముడుపులు ఇచ్చింది" అని వెల్లడించింది. కాగా, గతంలో వాల్ మార్ట్ మెక్సికో కార్యకలాపాలపై కూడా ఇవే తరహా ఆరోపణలు రాగా, ఫెడరల్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే.

More Telugu News