: 19 ఏళ్ల రష్యన్ తయారు చేసిన వైరస్... భారత ఏటీఎంలను దోచేస్తోంది!

ఓ రష్యన్ టీనేజర్ తయారు చేసిన వైరస్ భారత బ్యాంకర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. 19 ఏళ్ల ఆ యువకుడు తయారు చేసిన 'టయుప్కిన్' అనే వైరస్ ను ఏటీఎంలో ప్రవేశపెడితే, దానంతట అదే డబ్బును వెల్లువలా బయటకు పంపుతుంది. ఈ వైరస్ ఇండియాలో ఎంతగా వ్యాపించిందంటే, కొద్ది రోజుల క్రితం కొందరు యువకులు ఇదే వైరస్ ను వాడి ఏటీఎంను దోపిడీ చేయడానికి ప్రయత్నించగా కొద్దిలో ప్రమాదం తప్పి వారు పోలీసులకు పట్టుబడ్డారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఏటీఎంలను తయారు చేస్తున్న ఎన్సీఆర్ కార్పొరేషన్ ఇప్పటికే ఈ వైరస్ పై బ్యాంకులను అప్రమత్తం చేసింది. అతి సులువుగా ఈ వైరస్ ను ఏటీఎంలలోకి చొప్పించవచ్చని తెలుస్తోంది. ఏటీఎం సైడ్ ప్యానల్ తొలగిస్తే చాలు. యూఎస్బీ పోర్టు ద్వారా వైరస్ ను దానిలోకి పంపవచ్చు. ఆపై కొన్ని చిన్న కీ స్ట్రోక్స్ నొక్కడం ద్వారా అందులోని నగదు మొత్తాన్నీ బయటకు రప్పించొచ్చు. ఏ తరహా ఏటీఎంను అయినా ఈ వైరస్ సహాయంతో దోచేసే అవకాశముందని ఎన్సీఆర్ ఇండియా ఎండీ నవ్ రోజీ దస్తుర్ వ్యాఖ్యానించారు. ఏటీఎం సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసే పనిలో ఉన్నామని తెలిపారు. కాగా, ఇప్పటివరకూ కస్టమర్ల డేటా తస్కరించి కార్డుల స్కిమ్మింగ్ ఆపై దోపిడీలు జరుగుతుండగా, తాజాగా ఈ వైరస్ బ్యాంకులకు కొత్త తలనొప్పిగా మారింది. ఈ వైరస్ ను ఏటీఎం దగ్గరికి వెళ్లకుండా కూడా చొప్పించే అవకాశాలున్నాయని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఇండియన్ హ్యాకర్ ఒకరు తెలిపారు. బ్యాంకుల సిస్టమ్స్ లోకి మెయిల్స్ ద్వారా కూడా దీన్ని పంపి, అక్కడి నుంచి ఏటీఎంలలోకి వెళ్లేలా చేసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. బ్యాంకు వ్యవస్థలు గుర్తించలేని విధంగా 'పవర్ షెల్' సాయంతో ఈ వైరస్ విస్తరణ సులభమని అన్నారు. సాధారణ వైరస్ మాదిరిగా కాకుండా, ఓ ప్లెయిన్ టెక్ట్స్ రూపంలో ఇది ఉంటుందని పేర్కొన్నారు.

More Telugu News