: ఐఫోన్లు మాకొద్దు బాబోయ్ అంటున్న ఇండియన్స్!

ఇండియాలోని అపారమైన స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై కన్నేసిన యాపిల్ కు ఈ దఫా మాత్రం నిరాశే ఎదురవుతోంది. తాజాగా ఆ సంస్థ విడుదల చేసిన ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ రేపు మార్కెట్లోకి రానున్న తరుణంలో ముందస్తు బుకింగ్స్ ఏ మాత్రమూ ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ల ధరలు చాలా ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని సమాచారం. గత సంవత్సరం విడుదలైన ఐఫోన్లతో పోలిస్తే 15 శాతం ధర ఎక్కువగా ఉండటంతో కొనుగోలుదారులు ఏమాత్రం వీటి పట్ల ఆసక్తిని చూపడం లేదని యాపిల్ సంస్థ వాణిజ్య భాగస్వామి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ ఫోన్ల ధరలు అమెరికాతో పోలిస్తే అధికంగా ఉండటం కూడా కస్టమర్లను దూరంగా ఉంచిందని తెలిపారు. ఇదే సమయంలో బహిరంగ బుకింగ్స్ తో పోలిస్తే ఈ-కామర్స్ సైట్లలో కొంత తక్కువ ధరకు ఇవే ఫోన్లు లభిస్తుండటం కూడా మొబైల్ స్టోర్లపై ప్రభావం చూపుతుందని వివరించారు. కాగా, ఐఫోన్ల ముందస్తు బుకింగ్స్ వేల సంఖ్యలో కూడా లేవని తెలుస్తోంది. దీపావళి నాటికి వీటి ధరలు కొంతమేరకు తగ్గవచ్చని భావిస్తుండటం కూడా ప్రజలను వేచిచూసే ధోరణిలోకి నెట్టిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పండుగ సీజనులో ఇతర బ్రాండ్ల ఫోన్లు మరింత డిస్కౌంటుకు లభిస్తుండటం కూడా బుకింగ్స్ లేకపోవడానికి కారణం. వీటన్నింటికన్నా, ఐఫోన్ 6ఎస్ ప్రారంభ ధర రూ. 60 వేలకు పైగా ఉండటంతో, అధికాదాయ వర్గాలు తప్ప, ఎగువ మధ్య తరగతి ప్రజలకు సైతం ఈ ఫోన్ అందుబాటులో లేదని మార్కెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. యాపిల్ అనుకున్నంతగా, ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు సాగకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

More Telugu News