: ఆరు రోజుల లాభాల తరువాత నష్టాలలోకి మార్కెట్లు!

వరుసగా ఆరు సెషన్లలో లాభాలను నమోదు చేసిన భారత మార్కెట్ నేడు నష్టాల్లో నడిచింది. భారీ లాభాల తరువాత ఇన్వెస్టర్లు తమ ఈక్విటీలను విక్రయించేందుకే మొగ్గు చూపారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీలలో సైతం ఇదే ట్రెండ్ కనిపించింది. సెషన్ ఆరంభంలో క్రితం ముగింపు వద్ద ఉన్న సెన్సెక్స్ సూచిక ఆపై నెమ్మదిగా కిందకు జారిపోయింది. గురువారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 190.04 పాయింట్లు పడిపోయి 0.70 శాతం నష్టంతో 26,845.81 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక 48.05 పాయింట్లు పడిపోయి 0.59 శాతం నష్టంతో 8,129.35 పాయింట్ల వద్దకు చేరాయి. మంగళవారం నాటి సెషన్లో రూ. 99,30,391 కోట్లుగా ఉన్న మార్కెట్ కాప్, రూ. 98,81,674 కోట్లకు తగ్గింది. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.01 శాతం, స్మాల్ క్యాప్ 0.15 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో అల్ట్రా టెక్ సిమెంట్స్, అదానీ పోర్ట్స్, వీఈడీఎల్, టాటా స్టీల్, ఏసియన్ పెయింట్స్ తదితర కంపెనీల ఈక్విటీలు లాభపడగా, గెయిల్, రిలయన్స్, ఐటీసీ, కోటక్ బ్యాంక్, యస్ బ్యాంక్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి.

More Telugu News